సోము సవాల్‌కు ఉండవల్లి సై.. టైమ్, ప్లేస్ చెప్పాలన్న ఉండవల్లి!

భారత్ న్యూస్ రాజమండ్రి…సోము సవాల్‌కు ఉండవల్లి సై.. టైమ్, ప్లేస్ చెప్పాలన్న ఉండవల్లి!

A. Udaya Shankar.sharma News Editor…బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాల్‌ను స్వీకరించిన ఉండవల్లి

ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటన

సమయం, వేదిక చెబితే వస్తానంటూ వీర్రాజుకు స్పష్టీకరణ

రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో చర్చకు ఉండవల్లి సుముఖత

ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ వివాదం

రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య మాటల యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై బహిరంగ చర్చకు రావాలంటూ సోము వీర్రాజు విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. సమయం, వేదిక ఖరారు చేస్తే చర్చకు రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యం మైదానంలో గానీ, మీడియా సమక్షంలో గానీ ఈ చర్చను నిర్వహించుకుందామని ఉండవల్లి సూచించారు. బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతగా సోము వీర్రాజుకు అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉంటుందని, అందుకే ఆయనతో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.

ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారితీశాయి. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తికి మద్దతు ఇవ్వొద్దని ఆయన తెలుగుదేశం, వైసీపీ ఎంపీలను కోరారు. ఉండవల్లి వ్యాఖ్యలపై సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే ఆర్ఎస్ఎస్‌పై చర్చకు రావాలని సవాల్ విసిరారు.

ఈ సవాల్‌పై తాజాగా స్పందించిన ఉండవల్లి, తాను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఎందుకు వ్యతిరేకిస్తానో ఈ బహిరంగ చర్చ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తానని అన్నారు. దీంతో ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు బహిరంగ చర్చ వైపు అడుగులు వేస్తుండటంతో, ఈ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ చర్చ జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి.