‎కొయ్యలగూడెం మండలంలోనే నేవీ డిపో.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హమీ

భారత్ న్యూస్ విశాఖపట్నం..‎కొయ్యలగూడెం మండలంలోనే నేవీ డిపో.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హమీ

‎.. కొయ్యలగూడెం ప్రాంతంలోనే నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి.
‎.. ఎంపీని కలిసి తమ ప్రాంత అభివృద్ధి, ఉద్యోగాల కోసం విజ్ఞప్తి చేసిన యువత.
‎.. ఏలూరు ఎంపీ కొయ్యలగూడెం పర్యటనకు విశేష స్పందన.
‎.. హామీలు నెరవేర్చిన తర్వాతే ప్రాజెక్టు మొదలుపెడతామని ఎంపీ హమీ.

‎ఏలూరు, జనవరి 25: ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి కొయ్యలగూడెం మండలంలోనే నేవీ ఆయుధాగారం ఏర్పాటు చేస్తామన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట, బయ్యనగూడెం గ్రామాలలో నిర్మించబోయే స్మశాన వాటికలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శనివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఒక విశేష ఘటన చోటుచేసుకుంది. బోడిగూడెం పంచాయతీ పరిధిలోని గ్రామాలకు చెందిన కొందరు ప్రజలు, యువతీ యువకులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను కలిశారు. తమ ప్రాంతానికి నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు తీసుకువచ్చిన ఎంపీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. నేవీ ప్రాజెక్టును ఏర్పాటు చేయటం ద్వారా ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని,  90 శాతం మంది ప్రజానీకం ప్రాజెక్టుకు అనుకూలంగానే ఉన్నారని, అవగాహన లేకుండా మాట్లాడే  కొద్ది మంది మాటలు పట్టించుకోవద్దని ఎంపీని కోరారు.

‎..తనను కలిసిన గ్రామస్థుల నుద్దేశించి మాట్లాడిన ఎంపీ, 2500 కోట్లు ఖర్చుతో ఏర్పాటు చేయనున్న నేవీ ఆయుధ డిపో వల్ల 2000 మందికి ప్రత్యక్షంగా, మరికొన్ని వేలమందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని, ఒక సిటీ మాదిరిగా అన్ని రకాల సదుపాయాలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టువల్ల ఎవ్వరికీ నష్టం జరగదని, భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు దాదాపు రూ. 32 లక్షలకు పైన పరిహారం చెల్లిస్తామని, అర్హులైన నిరుద్యోగ యువతకు ప్రాజెక్టు ప్రారంభం ముందే ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే ప్రాజెక్టు మొదలుపెడతామని, డిపోను అడ్డుకోవాలని ఎవరైనా చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కొంతమంది తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నా, స్థానిక యువత చైతన్యవంతమై నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టుకు అనుకూలంగా ముందుకు రావటం పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని సంఘాల నేతలు నేవీ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఇటీవల మాట్లాడిన నేపథ్యంలో, స్థానిక యువత ప్రాజెక్టు కావాలని డిమాండ్ చేస్తూ ఎంపీని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ పర్యటనలో ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు.

‎ఇట్లు
‎ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారి కార్యాలయం,
ఏలూరు.

‎ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కవర్ చేయవలసిందిగా కోరుచున్నాము