భారత్ న్యూస్ గుంటూరు Ammiraju Udaya Shankar.sharma News Editor…….రాష్ట్ర అధికార భాషా సంఘానికి మండలి పేరు ఖరారు
జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
మాజీ మంత్రి, దివిసీమ గాంధీగా పేరొందిన మండలి వెంకట కృష్ణారావు పేరును రాష్ట్ర అధికార భాషా సంఘానికి పెడుతూ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. ఈ నెల 4న విజయవాడలో జరిగిన మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషనుగా మారుస్తామని ప్రకటించారు. దీనిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ జీవో నంబరు 25 విడుదల చేశారు. ఇకపై రాష్ట్ర అధికార భాషా సంఘం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్’గా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘం కార్యకలాపాలు అన్నింటినీ అదే పేరుతో నిర్వహించాలని జీవోలో స్పష్టం చేశారు.
మండలి వెంకట కృష్ణారావు గారి శతజయంతి సందర్భంగా ప్రత్యేక కథనం

మండలి వెంకట కృష్ణారావు 1941లో చిన్నతనంలోనే గాంధీజీ సందేశానికి ఉత్తేజితులై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఒకవైపు భారత స్వాతంత్య్ర సాధనకు అహింసాయుత పోరాటములు, రెండవ ప్రక్క ప్రజా సంక్షేమానికి, దేశ పురోభివృద్ధికి, నిర్మాణ కార్యక్రమములను గాంధీజీ అమలు జరుపుతూ వచ్చారు. త్యాగముతో పోరాటాలు, సేవాభావములతో నిర్మాణ కార్యక్రమములు ప్రబోధించి మహాత్మాగాంధి ఎంత దూరదృష్టిని ప్రదర్శించారో మనకు ఇప్పుడు తెలుస్తుంది.
గాంధేయ వాదాన్ని రాజకీయాలలో ప్రయోగించిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు. ఇప్పటి పరిస్థితులలో ఇది అసాధ్యమయినప్పటికి వారు ఆదర్శవంతంగా అమలు చేశారు.
తనకు ఉన్న ఏడు ఎకరాల భూమిలో అయిదు ఎకరాలు నిరుపేదలైన పది మందికి పంచడం, మంత్రిగా తన ఆస్తిపాస్తులను బహిరంగపరచడం, దండలు, విందులు, ఆడంబరాలు విసర్జించడం ప్రతి సంవత్సరం తన ఆదాయములో ఆరు వంతు దీనజన సంక్షేమ నిధికి యివ్వడం ద్వారా వినోభాబావే చెప్పిన సంపత్తిదానం అమలుపరిచారు. మాటలలో కాకుండా చేతలలో గాంధేయ మార్గాన్ని అమలుచేసిన ఆదర్శ నిర్మాణ కార్యకర్త మండలి వెంకట కృష్ణారావు.
“నీతి నియమాలు లేని రాజకీయాలు” దేశానికి ప్రమాదము అన్నారు గాంధీజీ. మానవతా దృష్టితో ప్రతి కార్యక్రమాన్ని పరిశీలించాలి, అమలు జరపాలి అన్నదే మండలి వెంకట కృష్ణారావు ఆకాంక్ష. రాజకీయాలలో ఉంటూ సమాజ సేవకు అంకితమైన సంఘ సేవకుడు మండలి వెంకట కృష్ణారావు. అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుపుటే వారి ప్రత్యేకత, చిన్ననాటినుండి పెద్దల స్నేహముతో పెద్దవాడైన మండలి వెంకట కృష్ణారావు పెద్ద ఆలోచనలతో, బృహత్తర కార్యక్రమాలను చేపట్టడంలో దిట్ట అనిపించుకొన్నారు. వీరు చేసిన కార్యక్రమాలను నేటి యువకులు ముఖ్యంగా ఒక్కసారి తెలుసుకోవడం అవసరం.
భావదేవరపల్లి నుండి అవనిగడ్డ ప్రతి రోజు నడచి వచ్చి అనేక కష్టాలకు ఓర్చికొని 10వ తరగతి ఉత్తీర్ణులయ్యారు. సామాన్య కుటుంబానికి చెందిన ఉపాధ్యాయుడగుటచే వారి తండ్రి మండలి వెంకట్రామయ్య ఆర్థిక యిబ్బందులకు లోనగుటచే చదువు చెప్పించలేక పోవుటచేత ఒక సంవత్సరంపాటు 1945-46లో యింటి వద్దనే ఉండాల్సి వచ్చింది. భావదేవరపల్లిలో శ్రీ కృష్ణారావు దబ్బతిప్ప ప్రాంతానికి పశువులను తోలుకొనివెళ్లి మేపుకొంటూ వచ్చేవారు. అచటి నుండి సముద్రము వరకు వ్యవసాయానికి యోగ్యమైన భూములు నీరు లేక ఖాళీగా ఉంటున్నాయి. వాటిని ఎలా సాగు చేయించాలా అని ఆలోచన కృష్ణారావుకు వచ్చింది. అనేక సంవత్సరాలుగా సాగు చేస్తున్న పేదలకు పట్టాలు యిప్పించి సహాయము చేయాలని కృష్ణారావు నిర్ణయించారు. వారి తండ్రి వెంకట్రామయ్య సహాయముతో ప్రభుత్వానికి విజ్ఞప్తిని, ఇరిగేషన్ సౌకర్యాలకు ఒక పథకాన్ని తయారుచేసి సమర్పించారు. ఆయనలో ఉన్న పట్టుదల దీక్ష, సేవాసక్తితో నేడు వేలాది పేదలకు భూములు, వేలాది ఎకరముల సాగుకు నీటి సౌకర్యము కల్గింది.
తాను రాజకీయంగా ఉన్నత స్థాయికి పెరుగుతూ, తన ప్రాంతములోని ప్రజల సంక్షేమానికి అభివృద్ధిని మహోన్నత స్థాయికి తెచ్చిన మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు.
మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సంవత్సరంలో దివిసీమను దివ్యసీమగా రూపొందించడానికి వారు పడిన శ్రమ, కృషి మరువలేనిది.
మండలి వెంకట కృష్ణారావు సముద్రతీరం వరకు భూముల సేద్యానికి 1977లో పులిగడ్డ ఆక్విడక్టు పెంపుదల వలన 70 వేల ఎకరాల వరకు సాగు పెరిగింది. విస్తరణకు అనుగుణంగా కాలువలను