భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ సదస్సుకు 3,500 మందితో భారీ భద్రత.. వైసీపీ విష ప్రచారాన్ని సహించం: హోంమంత్రి అనిత

Ammiraju Udaya Shankar.sharma News Editor…విశాఖ పెట్టుబడుల సదస్సుకు కట్టుదిట్టమైన భద్రత
సదస్సుపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ఉపేక్షించబోమన్న అనిత
రాజకీయ ఉగ్రవాదం పైనా ప్రభుత్వం సీరియస్గా ఉందని వ్యాఖ్య
విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. దాదాపు 3,500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రత విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడబోదని తేల్చిచెప్పారు.
సదస్సుకు హాజరయ్యే ప్రతి వీఐపీ విమానాశ్రయంలో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వారి గమ్యస్థానాలకు చేరేంత వరకు పూర్తిస్థాయి రక్షణ కల్పించే బాధ్యతను పోలీసు శాఖ తీసుకుందని అనిత వివరించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి అప్రమత్తత ప్రకటించామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
తీవ్రవాదంతో పాటు “రాజకీయ ఉగ్రవాదం” పైనా తమ ప్రభుత్వం సీరియస్గా ఉందని మంత్రి అనిత వ్యాఖ్యానించారు. విశాఖ సదస్సుపై జగన్ బ్యాచ్ సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారాన్ని ఉపేక్షించేది లేదని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలను కఠినంగా అణచివేస్తామన్నారు.

గతంలో వలసలకు కేంద్రంగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇప్పుడు పెట్టుబడులతో వలస వచ్చేవారికి గమ్యస్థానంగా మారుతోందని మంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీలు ఇప్పుడు తిరిగి వస్తున్నాయంటే దానికి “బ్రాండ్ సీబీఎన్”, మంత్రి నారా లోకేశ్ కృషి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పట్టుదలే కారణమని ఆమె కొనియాడారు. వారి సమష్టి కృషితోనే రాష్ట్రానికి మళ్లీ మంచిరోజులు వచ్చాయని తెలిపారు.