పుష్ప‌-2 డైలాగ్.. ట్రెండింగ్ వైఎస్ జ‌గ‌న్ రియాక్ష‌న్‌

భారత్ న్యూస్ అనంతపురం .. .పుష్ప‌-2 డైలాగ్.. ట్రెండింగ్ వైఎస్ జ‌గ‌న్ రియాక్ష‌న్‌

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తాజా ప్రెస్ మీట్‌లో పుష్ప 2 సినిమాలోని డైలాగ్ చెప్పారు. గురువారం ఉద‌యం జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో అధికార కూటమి పాలన, చంద్రబాబు నాయుడు హామీల అమలు తీరు, రెడ్ బుక్ రాజ్యాంగంపై విమర్శలు గుప్పించిన జ‌గ‌న్‌.. రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌రంగా స‌మాధాన‌మిచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఒక అభిమాని “గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్పా రప్పా నరికేస్తాం” అనే పోస్టర్ ప్రదర్శించగా, దానిపై పోలీసులు కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై స్పందించిన జగన్, సినిమా డైలాగ్‌లు రాయడం, పోస్టర్‌లు పట్టుకోవడం కూడా నేరమైతే దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.

రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ.. “పుష్ప 2 సినిమా డైలాగ్‌లు చెప్పినా తప్పే, గడ్డం ఇట్టన్నా తప్పే, అట్టన్నా తప్పే. ఏంది సామీ ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం మనం? ఇది ప్రజాస్వామ్యమేనా?” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టర్ పట్టుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యకర్త అని, ఆయనకు టీడీపీ సభ్యత్వం కూడా ఉందని జర్నలిస్టులు చెప్ప‌గా, ఆ ఆధారాల‌ను జ‌గ‌న్ మీడియాకు చూపించారు. “ఆ యువకుడికి టీడీపీ సభ్యత్వం ఉందంటే, ఇది టీడీపీ వాళ్లే చేయించినట్టు భావించాలా? ఒకవేళ అతడు పార్టీ మారి ఉంటే, చంద్రబాబు మీద కోపంతో టీడీపీ కార్యకర్త కూడా పార్టీ మారాడంటే మంచిదే కదా” అని జగన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ఘటన టీడీపీ అధికార దుర్వినియోగానికి, వైసీపీ కార్యకర్తలపై దాడులకు నిదర్శనమని ఆయన ఆరోపించారు.

ఈ వివాదం సోషల్ మీడియాలో హీట్ పుట్టించింది. జ‌గ‌న్ చెప్పిన ర‌ప్పా.. ర‌ప్పా డైలాన్‌గ‌ను వైసీపీ శ్రేణులు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ చెప్పిన పుష్ప‌-2 డైలాగ్ ట్రెండింగ్‌లో ఉంది. “సినిమా డైలాగ్‌లు రాయడం కూడా నేరమైతే, ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం?” అని వైసీపీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నారు. టీడీపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ, జగన్ రాజకీయ లబ్ధి కోసం సినిమా డైలాగ్‌లను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. జగన్ ప్రెస్ మీట్‌లోని ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.