భారత్ న్యూస్ డిజిటల్: నారాయణ్ పేట: తెలంగాణ:
నారాయణపేట జిల్లా పోలీసు
రూ.1 కోటి విలువైన 10 టన్నుల నకిలీ HT పత్తి విత్తనాలు పట్టివేత: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS
… అక్రమ నకిలీ పత్తి విత్తనాల వ్యాపారంపై ఉక్కు పాదం: జిల్లా ఎస్పీ.
నారాయణపేట జిల్లాలో రైతులను మోసం చేస్తూ నకిలీ HT పత్తి విత్తనాలను అక్రమంగా విక్రయిస్తున్న వారిపై నారాయణపేట జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు.
సోమవారం నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పత్రిక సమావేశం నిర్వహించి, జిల్లాలో పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాల వివరాలను వెల్లడించారు.
తేదీ 25.01.2026 సాయంత్రం నారాయణపేట మండలం బండగొండ గ్రామం మరియు కొత్తపల్లి మండలం భూనీడ్ గ్రామంలలో జిల్లా పోలీసులు, టాస్క్ ఫోర్స్ ప్రత్యేక పోలీసు బృందం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో, సుమారు రూ.1 కోటి విలువైన 10 టన్నుల (100 క్వింటాళ్ల) నకిలీ HT పత్తి విత్తనాలను నిందితులైన తండ్రీకొడుకుల ఇళ్ల నుండి మరియు వారి స్వాధీనంలో నుంచి స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు:
ఎ1: వి. బాలకృష్ణ నాయుడు,
నివాసి: భూనీడ్ గ్రామం, కొత్తపల్లి మండలం, నారాయణపేట జిల్లా.
ఎ2: శశివర్ధన్ నాయుడు,
నివాసి: భూనీడ్ గ్రామం, కొత్తపల్లి మండలం, నారాయణపేట జిల్లా.
ఈ ఘటనకు సంబంధించి నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు, మద్దూరు పోలీస్ స్టేషన్‌లో మరో కేసు చొప్పున మొత్తం రెండు కేసులు నమోదు చేయబడినట్లు ఎస్పీ తెలిపారు.
విచారణలో, నిందితులు నకిలీ HT పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేసి, నారాయణపేట జిల్లాలో రైతులకు అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా లాభాలు పొందుతున్నట్లు తేలింది. ఎ1 నిందితుడు గతంలో మద్దూరు, నర్వ మరియు దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఆ కేసులన్నీ ప్రస్తుతం కోర్టుల్లో విచారణలో ఉన్నాయి.
ఎస్పీ హెచ్చరిక:
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ మాట్లాడుతూ… వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల వ్యాపారంలో ఎవరైనా పాల్గొంటే, రవాణా చేసినా, సరఫరా చేసినా లేదా అధిక ధరలకు విక్రయించినా, వారిపై చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ప్యాకింగ్ లేని లేదా అనుమానాస్పద విత్తనాలను కొనుగోలు చేయవద్దని, నకిలీ విత్తనాల వ్యాపారం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ మాట్లాడుతూ… ఇప్పుడు పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాలు సుమారు మూడు మండలాల్లో పంటలు వేయడానికి సరిపడే పరిమాణంలో ఉన్నాయని తెలిపారు. రైతులు గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ షాపులలోనే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్ తీసుకోవాలని, లాట్ నెంబర్ ఉన్న విత్తనాలనే కొనాలని సూచించారు. ఎక్కడైనా అక్రమంగా నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

అభినందనలు:
ఈ కేసును విజయవంతంగా ఛేదించినందుకు, డీఎస్పీ నల్లపు లింగయ్య పర్యవేక్షణలో సమర్థవంతంగా పనిచేసిన నారాయణపేట మరియు కోస్గి సీఐలు, శివశంకర్, సైదులు, నారాయణపేట రూరల్ మరియు మద్దూరు ఎస్ఐలు విజయ్ కుమార్, రాముడు, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ పురుషోత్తం, ప్రత్యేక పోలీసు బృందం మరియు వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ అభినందించారు.