భోగ భాగ్యాలిచ్చే భోగి పండుగ
ఈ పండుగ విశిష్టత ఇదీ
రేపు భోగి పండుగ సందర్భంగా
భోగికి ముందు తర్వాత చలిమంటలుగా పిలిచే వాటిని ఆరోజు మాత్రం భోగి మంటలు అంటారు. దక్షిణానయంలోని వర్షాలకు,చలికి దేహంలో పెరిగిన వాత లక్షణాలు,అనారోగ్యాలు నువ్వుల నూనెతో, మూలిక గుణాలు గల కట్టెలు, కంపలతో కాగిన నీళ్లతో అభ్యంగన స్నానం చేస్తే తొలగుతాయనేది పూర్వీకుల విశ్వాసం. ఆరోగ్యం,నూతనోత్సాహం ఉత్తరాయణం వైపు నడిపిస్తుంది. భోగిమంటల్లో ఇంత అంతరార్థం ఉంది. దీన్నిబట్టే ఈ పండుగ ప్రాధాన్యత గ్రహించాలి. ఏడాది పొడవునా ఎన్నో పండగలు జరుపుకుంటాం. ప్రతి పండుగకు ఏదో ఒక నేపథ్యం ఉంటుంది. కానీ భోగి అరుదైన స్వతంత్రం ఉన్న పండుగ. భోగి అనే పేరులోని ఎంతో అంతరార్థం ఉంది. ఇది ఏ దేవుడిని, దేవతను సూచించదు. మరి భోగి అనే పేరు ఎందుకు వచ్చింది..? ఎలా వచ్చిందో తెలుసుకుందాం..
రాజ భోగాలు…
భోగములు..అంటే సుఖములను అనుభవించేవాడు భోగి. తెలుగు నేల వ్యవసాయ ప్రధానమైనది.ఏడాది పొడవునా కష్టపడిన రైతు పండిన పంటతో ఆనందంగా ఇంటికి వచ్చి భార్యా పిల్లలు, బంధుమిత్రులతో రాజభాగాలను అనుభవించే పండుగ గనక దీన్ని భోగి అంటారు. దక్షిణాయానాం చివర రోజు ఇది. ఆనాడు ఐహికమైన, భౌతికమైన సుఖాలను భోగాలను అందరితో పంచుకోవాలి. పండిన పంటలను పనివారికి, హరిదాసులకు, యాచకులకు, పశుపక్షాదులకు వితరణ చేయడం రాజభోగం. సంపదను పదిమందికి త్యాగం చేయడం భోగం… తానొక్కడే తినడం రోగం. అనే సత్యాన్ని తెలిపేదే భోగి పండుగ. మరునాటి ఉత్తరాయాణంలో ఆధ్యాత్మిక, పరమార్థక చింతనలో ప్రధానమైన త్యాగగుణాన్ని భోగి అందిస్తుంది. అన్ని లోహాలను బంగారంగా మార్చే పరుషవేదిని తయారు చేయడానికి వేమన తన స్నేహితులతో చాలా ప్రయోగాలు చేసి వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. చివరికి విజయం లభించి మేలిమి బంగారం తయారయ్యేసరికి వైరాగ్యం వచ్చి యోగి అయ్యాడు. అదే భోగి పండుగ రహస్యం.
పురుషులకు పండుగభోగం
పాత బట్టలను పేదలకు పంచాలి.. పాడైపోయిన పాత వస్తువులను తగలబెట్టి అందరూ అందులో చలిమంట కాసుకుంటూ ఆనందించాలి. వేడి నీళ్లు పెట్టుకుని తలంటూ పోసుకోవాలి. బంధాలే దుఃఖాలకు కారణమని తెలుసుకోవాలి. ఎండిపోయిన చెట్టు కొమ్మలను విరిస్తే రాబోయే వసంతానికి కొత్త కొమ్మలు వస్తాయి. గత వర్షాకాలంలో మొలసిన కలుపు మొక్కలను తగలబెడితే నేల శుభ్రమవుతుంది. చలికి పెరిగిన దోమలు భోగిమంట పొగ, మంటలతో తగ్గిపోతాయి.
గొబ్బెమ్మలను సాగనంపే భోగం
ఆవు పేడ మనకెంతో పూజనీయంగా, ఆరోగ్యకరంగా ఉపయోగపడుతుంది.దాంతో ధనుర్మాసం నెల రోజులు గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించి పూజిస్తారు. పిడకలపై ఆవుపాలతో కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. భోగి పండుగనాడు సాయంకాలం సంధిగొబ్బెమ్మెలను పెట్టి పూజిస్తారు. పాటలు పాడి కోరికలు కోరుకుంటారు. పెద్ద ముత్తైదువులకు వాయినాలు, గొబ్బెమ్మలను గోపికలు గా భావిస్తారు. తల్లికి ప్రత్యామ్నాయంగా గోమాత చెప్పబడింది. తల్లిపాలు లేని పిల్లలకు ఆవుపాలే దిక్కు. భోగినాడు గోదా శ్రీ రంగనాదుల కళ్యాణం జరిగింది. ధనుర్మాసం నెల రోజులు ఆమె గోపికా భక్తితో పాటలు పాడింది. ఇల్లు పాడిపంటలతో వర్ధిల్లడానికి గోపికల వలే ప్రార్ధించి గొబ్బబ్బలను సాగనంపడమే భోగి పండుగలో స్త్రీల పాత్ర.
పిల్లలకు ఆరోగ్య భోగం
భోగి పళ్ళు, బొమ్మల కొలువులు కూడా ఈ పండుగకు ప్రధానమైనవి. రేగి పండ్లు చిన్నపిల్లల తలపై పోసి పేరాంటం జరుపుతారు. రేగి పండుగను ఆర్కఫలం అంటారు. సూర్యునికి ప్రతినిధిగా సౌరశక్తిని, జ్ఞానాన్ని ,ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి రేగి పండ్లకు ఉంది.ఉత్తరాయాణం లో రాబోతున్న మొదటి చాంద్ర మానమాసం మాఘమాసం. ఇది సూర్యరాధనాల కాలం. చిన్న పిల్లలకు రేగుపండ్లు తలపై పోయడం వలన వాటి స్పర్శ వారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సూర్యుడు ఆశీస్సులను అందిస్తున్నట్లు అవుతుంది. భోగినాడు బొమ్మల కొలువులకు హారతి ఇస్తారు. పిల్లల్లో సుజనాత్మకతను, పరిశీల విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, నిర్మాణ శాస్త్ర దృష్టిని పెంపొందించే బొమ్మల కొలువలను ఆరోజు ఏర్పాటు చేస్తారు. అందుకే ఇది పిల్లల భోగి పండుగ.
దంపతులకు ఇంద్రభోగం

ఇంద్రభోగాలు అన్నిటికంటే గొప్పవి దేవతల రాజుగా స్వర్గంలోనే కాక యజ్ఞయాగాది కర్మకుల లోనూ పెద్ద భాగాన్ని పొందుతారు. భోగి అనే పదానికి ఇంద్రుడే సరిపోడు. తూర్పు దిక్కుకు, మేఘాలకు అధిపతిగా భూమికి వర్షాన్ని ఇచ్చేవాడు ఇంద్రుడే. భోగి పండుగ ఇంద్ర పూజ కోసం ఏర్పడింది. ఉత్తరాయాణం దేవాయణం కాలం కనుక ముందు రోజు దేవతలు అధిపతి అయిన ఇంద్రున్ని పూజించి ప్రసన్నం చేసుకోవాలి. భోగి మంటలు మంత్ర రహితమైన హోమాలుగా ఇంద్రుడిని ఆరాధించి సంతోష పరచాలి. ఆ మంటలతో నీరు, గాలిలో తేమ ఆవిరిగా మారి పొగతో నింగికి చేరి మేఘాలు ఏర్పడి అనుకూల పరిస్థితుల్లో వర్షాలు కురుస్తాయి. గోదాదేవి రంగనాథుడి కోసం ధనుర్మాసం అంతా చేసిన తపస్సుకు రంగనాథుడు ప్రత్యక్షమై పెళ్లి చేసుకున్నాడు. ఒకరికొకరు ఇష్టపడిన స్త్రీ పురుషులు దంపతులైతే అప్పుడే భోగి అవుతారని ఈ భోగి పండుగ తెలియజేస్తుంది.
కొండ్రెడ్డి లక్ష్మీ శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్టు