భారత్ న్యూస్ డిజిటల్ ,: హైదరాబాద్: అటవీ అధికారుల సంయుక్త కృషితోనే సాహెబ్ నగర్ కలాన్ సక్సెస్
ప్రభుత్వం, సీఎం, ఫారెస్టు మినిస్టర్, న్యాయశాఖ సహకారం మరువలేనిది
పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ వ్యాఖ్యలు
ఈ కేసులో కృషి చేసిన అధికారులకు ఘనంగా సన్మానం
హైదరాబాద్
తెలంగాణ అటవీ అధికారుల సంయుక్త కృషితోనే సాహెబ్ నగర్ కలాన్ సక్సెస్ అయిందని పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఎంతోమంది కృషి చేశారన్నారు. ఈ కేసులో కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం, ఫారెస్టు మినిస్టర్, న్యాయశాఖ సహకారం మరువలేనిదన్నారు. సాహెబ్ నగర్ కలాన్ కేసులో కృషి చేసిన అధికారులను సోమవారం ఘనంగా సన్మానించారు. తెలంగాణ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) డా. సువర్ణ మాట్లాడుతూ.., సాహెబ్‌నగర్ కలాన్ అటవీ భూమి కేసులో విజయం అటవీ శాఖ సంయుక్త కృషి వల్లే సాధ్యమైంది అని తెలిపారు. ఈ కేసు విజయవంతంగా ముగియడంపై తాను ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నానని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని కేబీఆర్ నేషనల్ పార్క్‌లో మాట్లాడిన డా. సువర్ణ, ఈ కేసు చాలా ఏళ్ల క్రితం ప్రారంభమైందని, ఇప్పుడు చట్టపరంగా తుది నిర్ణయానికి రావడం అటవీ శాఖకు ఒక ముఖ్యమైన ఘట్టమని అన్నారు. దీర్ఘకాల న్యాయపోరాటంలో అటవీ శాఖకు అండగా నిలిచిన అధికారులు, సిబ్బంది, ఉద్యోగుల కృషిని ఆమె అభినందించారు. డా. సువర్ణ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ నిరంతర సహకారం, మార్గనిర్దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే న్యాయవ్యవస్థ న్యాయం నిలబెట్టినందుకు, పర్యావరణ అంశాలను బాధ్యతగా వెలుగులోకి తీసుకువచ్చిన మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ సీసీఎఫ్ బుచ్చిరెడ్డితో పాటు, రికార్డుల సంరక్షణలో సహకరించిన ఇతరులను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా కేబీఆర్ నేషనల్ పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో, కేసు విజయంలో భాగస్వాములైన అధికారులు, మాజీ ఉద్యోగులు, సహాయక సిబ్బందిని సన్మానించారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌కు సంబంధించిన భూమి అటవీ శాఖదే అని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చిందని డా. సువర్ణ పేర్కొన్నారు. ఈ తీర్పు అటవీ సంరక్షణకు, చట్ట పరిరక్షణకు ఒక గొప్ప విజయమని, భవిష్యత్ తరాల కోసం అటవీ సంపదను కాపాడే దిశగా ఇది కీలకమని ఆమె పేర్కొన్నారు.
