భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణలో ఇక సులభంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ..
📍హైదరాబాద్: కుల ధ్రువీకరణ పత్రాలను సులభంగా పొందేలా ‘మీ సేవ’ నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు(ప్రత్యేక కేసులు మినహా) ఇప్పుడు మీ సేవ కేంద్రాల్లో నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు.
గతంలో ప్రతి దరఖాస్తుకు కొత్తగా తహసీల్దార్ ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేది. దీనివల్ల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో జాప్యం ఏర్పడుతుండడంతో.. ఈ సమస్యను నివారించడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాలతో.. మీ సేవ విభాగం దీనిపై దృష్టిపెట్టింది. సీసీఎల్ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, తహసీల్దార్లతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన అనంతరం తాజా మార్పులు చేపట్టారు. ప్రయోగాత్మకంగా ఈ మార్పును 15 రోజుల క్రితం అమల్లోకి తెచ్చారు. ఇప్పటికే 17,571 మంది ఈ సేవను విజయవంతంగా పొందారు. ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. కొత్తగా జారీ చేసే సర్టిఫికెట్లో.. గతంలో ఆమోదించిన అధికారి వివరాలు, తిరిగి జారీ తేదీ ఉంటాయి. ప్రత్యేక కేసుల్లో(ఉదాహరణకు హిందూ ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి బీసీ-సీ కిందకు వస్తే.. జీవో ఎంఎస్ నం.3, తేదీ 9.9.2020 ప్రకారం) దరఖాస్తును గత ప్రక్రియ ప్రకారం ఆమోదం కోసం పంపిస్తారు.
సేవను ఎలా పొందాలంటే…
పాత సర్టిఫికెట్ నంబర్ తెలిస్తే: మీ సేవ కౌంటర్లో ఆ నంబర్‌ను అందించడం ద్వారా కొత్త ప్రింటవుట్ పొందవచ్చు.
నంబర్ తెలియకపోతే: మీ సేవ సిబ్బంది మీ జిల్లా, మండలం, గ్రామం, ఉప-కులం, పేరు ఆధారంగా శోధిస్తారు. మరిన్ని వివరాల కోసం మీ సేవ వెబ్‌సైట్‌ను లేదా సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చని మీ సేవ కమిషనర్ రవికిరణ్ తెలిపారు.
