ఐపీఎల్ రద్దు.. యుద్ధ భయం.. పాకిస్థాన్ లోను మ్యాచ్ లకు బ్రేక్…!

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడింది. అసలు మ్యాచ్ లు వాయిదాకు ఖచ్చితమైన కారణం ఏమిటి? పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ దాడులు ఈ నిర్ణయంపై ఎలాంటి ప్రభావం చూపాయి? బీసీసీఐ ఏం చెబుతోంది? విదేశీ ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు ఈ పరిస్థితిపై ఎలా స్పందించాయి? ఈ వాయిదా IPL స్పాన్సర్‌లు, బ్రాడ్‌కాస్టర్‌లపై ఆర్థికంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది? భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలు తగ్గితే, IPL మ్యాచ్‌లు సాధారణ షెడ్యూల్‌కు ఎప్పుడు తిరిగి వస్తాయి?

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఐపీఎల్ మ్యాచ్ లపై ప్రభావం చూపాయి. ఐపీఎల్ మ్యాచ్ లను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి.. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత .. పాకిస్థాన్ భారత్ పై దాడులు చేపట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో డోన్లు, మిసైల్స్ తో అటాక్ చేస్తోంది. అయితే భారత్ ఈ దాడులను తిప్పి కొడుతోంది. దీనితో పాటు రక్షణ చర్యలను తీసుకుంటోంది. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను జమ్మూ, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో వైమానిక దాడుల హెచ్చరికల కారణంగా మధ్యలోనే ఆపేశారు. ప్రేక్షకులను సురక్షితంగా తరలించారు.

IPL చైర్మన్ అరుణ్ ధూమల్ కూడా ఈ తరలింపు ప్రక్రియలో సహాయం చేశారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 58 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ధర్మశాలలో ఆగిపోయిన మ్యాచ్‌తో సహా రద్దు సమయంలో 12 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు, కోల్‌కతాలో ఫైనల్‌తో సహా లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, జైపూర్ వంటి వేదికల్లో జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులతో మ్యాచ్ లను బీసీసీఐ రద్దు చేసింది. IPLని మధ్యలో రద్దు చేయడం ఇది రెండోసారి. 2021లో కోవిడ్-19 బయో-బబుల్ ఉల్లంఘన కారణంగా టోర్నమెంట్‌ను వాయిదా వేశారు. తర్వాత రెండో దశను UAEలో నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ ను తాత్కాలికంగా రద్దు చేశారు..

అయితే మ్యాచ్ లను పూర్తిగా రద్దు చేయకుండా.. BCCI కొద్ది రోజులకే మాత్రమే IPLని రద్దు చేసింది. ప్రస్తుతం ఆటగాళ్లు, సిబ్బందిని వారి స్వస్థలాలకు సురక్షితంగా తిరిగి పంపడానికి చర్యలు తీసుకుంటున్నారు. చాలా మంది విదేశీ ఆటగాళ్లు, సిబ్బంది వారి స్వదేవాలకు బయలుదేరారు. దేశంలో యుద్ధం జరుగూ ఉంటే క్రికెట్ కొనసాగడం మంచిగా కనిపించదు BCCI సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ రద్దుతో మే 25న కోల్‌కతాలో ముగియాల్సిన సీజన్ భవిష్యత్తు అనిశ్చితంలో పడింది. BCCI ఒక వారం తర్వాత IPL 2025ని తిరిగి ప్రారంభిస్తామని, కొత్త షెడ్యూల్, వేదికలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. సంబంధిత అధికారులు, వాటాదారులతో సమగ్ర చర్చల తర్వాత కొత్త షెడ్యూల్, వేదికలపై తదుపరి ప్రకటన ఉంటుందని బీసీసీఐ తెలిపింది.

అటు ధర్మశాల వేదికగా జరుగుతున్న పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ను భద్రతా కారణాలరీత్యా అర్ధాంతరంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. నిజానికి లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌ శుక్రవారం జరగాల్సి ఉంది. కానీ బీసీసీఐ నిర్ణయంతో నిలిపివేత అమల్లోకి రానుంది. దీంతో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగడం లేదు. ఈ నేపథ్యంలో అభిమానులకు టికెట్ల డబ్బులను ఫ్రాంఛైజీలు తిరిగి చెల్లిస్తున్నాయి. ముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10న ఉప్పల్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. కానీ బీసీసీఐ నిర్ణయం మేరకు ఈ మ్యాచ్‌ జరగడం లేదు. దీంతో ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న అభిమానులకు సన్‌రైజర్స్‌ యాజమాన్యం రీఫండ్‌ ప్రక్రియను చేపట్టింది.

అటు సైన్యం సేవలను కొనియాడుతూ పలువురు క్రీడాకారులు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. సైన్యం వెంటే తాము ఉన్నట్లు తెలిపారు. దేశ సంరక్షణలో భాగంగా మన సైన్యం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని… మన దేశ గౌరవాన్ని పెంచడంలో వారు ఎప్పుడూ ముందుంటారని క్రికెటర్‌ రోహిత్‌ శర్మ తెలిపారు. అందుకే ఇలాంటి క్లిష్ట సమయాల్లో తప్పుడు కథనాల వ్యాప్తి, అలాంటి వార్తలను నమ్మకుండా ప్రతీ భారతీయుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అలాగే క్లిష్ట సమయంలో అనుక్షణం దేశాన్ని సంరక్షిస్తోన్న మన సైనికులకు సెల్యూట్‌ అని విరాట్‌ కోహ్లీ పేర్కొన్నారు.

జమ్మూపై పాక్‌ చేపట్టిన డ్రోన్‌ దాడిని సమర్థవంతంగా అడ్డుకున్న పోరాట యోధులను గౌరవిద్దామని క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ అన్నారు. మన వీరుల అచంచల ధైర్యసాహసాలకు, దేశం కోసం వారితోపాటు వారి కుటుంబాలు చేసే త్యాగాలకు మనమంతా ఎప్పటికీ రుణపడి ఉండాలన్నారు. మీ ధైర్యం, క్రమశిక్షణ, త్యాగమే మన జాతికి బలమని బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ వంటి పరిస్థితుల వేళ మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సైనికుల ధైర్యం, నిస్వార్థ సేవలను ఎల్లవేళలా తాము గుర్తు చేసుకుంటామన్నారు. దేశం మొత్తం మీ వెంట నడుస్తోందని తెలిలపారు.

అటు పాకిస్థాన్ లో కూడా క్రికెట్ మ్యాచ్ లపై ఉద్రిక్తతల ప్రభావం పడింది. భారతలో ఐపీఎల్ మాదిరి పాకిస్థాన్ లో జరిగే పీఎస్ఎల్ మ్యాచ్లు రద్దు అయ్యాయి. భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్రమైన సైనిక ఉద్రిక్తతలు, భద్రతా ఆందోళనల కారణంగా లాహోర్‌లో షెడ్యూల్ చేసిన మ్యాచ్ లు రద్దయ్యాయి. ఆపరేషన్ సిందూర్ దాడులకు కౌంటర్ గా పాకిస్థాన్ మే 8న జమ్మూ, పఠాన్‌కోట్, ఉధమ్‌పూర్ వంటి భారత సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్, మిస్సైల్ దాడులకు ప్రయత్నించింది. దీనిని భారత్ తిప్పికొట్టింది. ఈ దాడుల్లో భాగంగా, భారత్ లాహోర్‌లోని పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ రాడార్‌ను నాశనం చేసినట్లు ప్రకటించింది. అయితే లాహోర్‌లోని గద్దాఫీ క్రికెట్ స్టేడియంపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో మే 8న డ్రోన్ దాడి జరిగినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది.

దీనితో పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య షెడ్యూలైన మ్యాచ్ రద్దయింది. ఈ ఘటనలు విదేశీ ఆటగాళ్లలో భయాందోళనలను రేకెత్తించాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు జేమ్స్ విన్స్, టామ్ కర్రన్ వంటి వారు స్వదేశానికి తిరిగి వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మే 8న గద్దాఫీ స్టేడియంలో అత్యవసర సమావేశం నిర్వహించి, మిగిలిన PSL మ్యాచ్‌లను కరాచీ, దుబాయ్ , దోహాకు మార్చే ఆలోచన చేసింది. లాహోర్‌లో షెడ్యూలైన క్వాలిఫైయర్ , ఫైనల్ మ్యాచ్‌లు కూడా రద్దయ్యాయి. 2009లో లాహోర్‌లో శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన ఉగ్రదాడి గుర్తుకు వచ్చిన నేపథ్యంలో, పాకిస్థాన్‌లో క్రీడా ఈవెంట్‌ల భద్రతపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. PCB భద్రతా కారణాలతో మ్యాచ్‌లను రద్దు చేసినట్లు ప్రకటించింది.