
గుండెపోటుకు కారణం అధిక రక్తపోటే! కాబట్టి బీపిని రోజూ చెక్ చేసుకోవడం మంచిది. ధూమపానం, ఆల్కహాల్ లను దరిచేరనివ్వొద్దు. ధూమపానం అథెరోస్క్లెరోసిస్‌కు కారణమయ్యేలా చేస్తుంది. ఇది అధిక రక్తపోటుకు గురై, గుండెవైపు వెళ్లే ఆక్సిజన్ ప్రవాహాన్ని నిదానిస్తుంది. ఇక ఆల్కహాల్ చర్మంలోని రక్తనాళాల విస్తరణకు దారితీస్తుంది. ఆపై అవయవాల పనితీరుపై ప్రభావం చూపెడుతోంది. కాబట్టి ఈ రెండింటికి ఆస్కారం లేకుండా చూసుకోవాలి.
ఒత్తిడిని దూరం చేయండి…
అధిక ఒత్తిడి కూడా గుండెపై ప్రభావం చూపుతుంది. కాబట్టి డైలీ యోగా, ధ్యానం లాంటివి ప్రాక్టీస్ చేయండి. కుటుంబంతో వీలైనంతసేపు సరదాగా గడపండి. మీకు నచ్చిన చిన్న చిన్న పనులను చేస్తూ ఉండటం వల్ల మీ శరీరం అలసటకు గురికాదు. ఉత్సాహంగా ఉంటుంది. కావున ఒత్తిడిని ఎంచక్కా జయించొచ్చు.
ఆహారంలో మార్పు:
రోజూ తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకోవటం చాలా ముఖ్యం. మాంసాహారులైతే అప్పుడప్పుడు మాంసానికి బదులుగా చిక్కుళ్లు తినొచ్చు. వీటితో కొలెస్ట్రాల్ లేకుండానే మంచి ప్రొటీన్ లభిస్తుంది. వేపుళ్లు సైతం తగ్గిస్తే మేలు. వనస్పతికి దూరంగా ఉంటే ఇంకా మంచిది. అలాగే బాగా పాలిష్ చేసిన బియ్యంకన్నా దంపుడు బియ్యాన్ని తినొచ్చు. రకరకాల కూరగాయలు, పండ్లను రోజూవారీగా తినొచ్చు.
గుండె వేగాన్ని పెంచే వ్యాయామాలివి…
రోజులో పది నిమిషాలపాటు ఇంటి చుట్టుపక్కల్లో కాస్త వేగంగా నడవొచ్చు. వీలుంటే ట్రెడ్‌మిల్ మీద నడవాలి. ఎలాంటి వ్యాయామ పరికరాలు లేవని, చేయలేనని బాధపడాల్సిన పనిలేదు. ఉన్నచోటే చిన్న చిన్న కదలికలతో… చేతులు, కాళ్లను ఫ్రీగా ఆడిస్తూ ఉండాలి. దీంతో శారీరక ఆరోగ్యం అనేది మెరుగవుతుంది.
ఆరోగ్య సూచికలపై కాస్త అవగాహన…
గుండె పనితీరును శరీరతత్వమే చెప్తుంది. వీటిని గుర్తించే నేర్పే మనకు కావాలి. ఇందుకోసం కొన్ని సూచికలు/ పరిమాణాల గురించి కొంత సమాచారం తెలుసుకొని ఉండటం మంచిది.
బీఎంఐ- శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బాడీ మాస్ ఇండెక్స్) ఎంతుందో సరి చూసుకోండి. ఇది కనీసం 18.5 నుంచి 25 మధ్యలోనే ఉండాలి. పెరిగితే జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
బీపీ- సాధారణ రక్తపోటు 120/80 కన్నా తక్కువగానే ఉండాలి.
రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్ సంఖ్య 200 ఎంజీ/డీఎల్ కన్నా మించకూడదు.
ఇక పరగడుపున, అంటే ఉదయంపూట రక్తంలో గ్లూకోజ్ స్థాయి 100 ఎంజీ/డీఎల్ కన్నా తక్కువగా ఉండాలి.
అయితే ఇవి అందరిలో ఒకేలా ఉండాలనేమీ లేదు. వయసు, ఇతరత్రా వ్యాధులు, వంశపారంపర్యంగా వచ్చే స్వభావాలు… వంటివన్నీ వీటిపై ఆధారపడి ఉంటాయి కాబట్టి కాస్త అటుఇటు తేడా ఉండొచ్చు. అటువంటప్పుడు ఒకసారి వైద్యుల్ని సంప్రదించి ఆయా సూచికల సంఖ్యలు ఎంత మోతాదులో ఉండాలో తెలుసుకొని, దానికి తగ్గట్టుగా నడచుకోవాలి.
ఎల్లప్పుడూ… మంచి ఆలోచనలతో… సంతోషకరమైన వార్తలు వింటూ, వినిపిస్తూ… పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తే మీ గుండె హెల్తీగా ఉంటుంది.