భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,అగడు బడ్డట్టుగా అక్రమ సంపద పోగేస్తారు..!
అడ్డంగా దొరికిపోతారు..!
సంపదను అనుభవించలేరు.!
అక్రమంగా వచ్చింది కాబట్టి నిత్యం టెన్షన్ బతుకు..!
ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏంటి.. ప్రశాంతత లేకపోతే..! కష్టపడి సంపాదించమన్న నిజాయితీతో కూడిన ఆత్మ సంతృప్తి లేకపోతే..!
•••••••
అయ్యగారు అద్దెకున్న ఇంట్లోనే 30 లక్షలు దొరికాయంటే.. పెద్ద ఆనకొండే..
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు.. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోనే 60 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడటం కలకలం రేపుతోంది..
రేపో మాపో ఐఏఎస్ అర్హత పొందబోతున్న ఆ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో అదనపు కలెక్టర్‌తో పాటు మరో ఇద్దరు విద్యాశాఖ అధికారులు అరెస్టయ్యారు.. అయ్యగారి పాపాలలో పాలు పంచుకొని జైలు పాలయ్యారు.
ఓ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యువల్ చేసేందుకు.. యాజమన్యం నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.. వెంకట్ రెడ్డి ప్రస్తుతం హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేసి రూ. 60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు తన ఛాంబర్‌లోనే పట్టుకున్నారు. ఆయనతో పాటు గౌస్, మనోజ్ అనే మరో ఇద్దరు విద్యాశాఖ సిబ్బందిని కూడా పట్టుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే హనుమకొండలోనీ చైతన్యపురి కాలనీలో ఆయన నివాసం ఉంటున్న అద్దె ఇంట్లో 30 లక్షల రూపాయల కరెన్సీ లభ్యం అయింది. ఆ డబ్బుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు.. హైదరాబాద్‌లోని తన నివాసంలో విలువైన భూముల పత్రాలు స్వాదీనం చేసుకున్నారు

అదనపు కలెక్టర్ వెంకటరెడ్డిపైన గతంలో కూడా పలు కేసులు నమోదు అయ్యాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల పైన కేసులు ఉన్నాయనీ ఏసీబీ అధికారులు తెలిపారు.. నల్గొండ జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో ఈయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.. జనగామ RDO గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు విషయంలో కూడా అవినీతి కి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
సీసీ కెమెరాలు లేకుండా చూసి లంచం తీసుకున్నాడు. అయినా ఏసీబీ అధికారుల నుండి తప్పించుకోలేకపోయాడు. పక్కా ప్లాన్ ప్రకారం లంచం తీసుకున్నాడు. పగడ్బందీగా దొరికారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అడ్డంగా బుక్కై అరెస్ట్ అవడంతో ఆయన బాధితులు సంబరాలు జరుపుకున్నారు.. ఊరుకొండ, ఆరేపల్లి, వంగపహాడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులు హన్మకొండ కలెక్టరేట్ ముందు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.