అల్ప‌పీడ‌నం.. ఏపీకి భారీ వ‌ర్ష సూచ‌న‌

భారత్ న్యూస్ నెల్లూరు….అల్ప‌పీడ‌నం.. ఏపీకి భారీ వ‌ర్ష సూచ‌న‌
ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురుస్తోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా వాతావరణ హెచ్చరిక విడుదల చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

గురువారం నాటికి మరో అల్పపీడనం, వాయుగుండంగా బలపడే అవకాశం ఉంద‌ని, గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. ఈ సమయంలో చెట్ల క్రింద నిలబడకూడదని, పిడుగుల సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు బుధవారం లోపే తీరానికి చేరాలని విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా, కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోందని, ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక స్థాయి దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు