భారత్ న్యూస్ విశాఖపట్నం..అన్నవరం ప్రసాద కేంద్రంలో కలకలం
ప్రసాదం బుట్టల్లో ఎలుకలు… భక్తుల్లో ఆగ్రహం
కాకినాడ జిల్లా / అన్నవరం:
అన్నవరం క్షేత్రంలో భక్తుల విశ్వాసాన్ని కలవరపెట్టే ఘటన చోటుచేసుకుంది. దేవస్థానం పరిధిలోని ప్రసాద కేంద్రంలో ప్రసాదం బుట్టల్లో ఎలుకలు స్వైరవిహారం చేస్తున్న దృశ్యాలు వెలుగుచూశాయి. ఎలుకలు తిన్న ప్రసాదాన్నే భక్తులకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వైజాగ్ నుంచి భీమవరం వెళ్తున్న కొందరు భక్తులు గురువారం రాత్రి 11 గంటల సమయంలో హైవేపై ఉన్న అన్నవరం ప్రసాద కేంద్రం వద్ద ప్రసాదం కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ప్రసాదం ఉంచిన బుట్టల్లో ఎలుకలు తిరుగుతుండటాన్ని గమనించి షాక్కు గురయ్యారు. ఎలుకలు ప్రసాదాన్ని తింటూ, బుట్టలపై ఎగిరిపడుతున్న దృశ్యాలు కనిపించడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా, “ఇక్కడ ఎలుకలు ఇలాగే ఉంటాయి… ఇష్టమైతే కొనుక్కోండి, లేకుంటే వెళ్లిపోండి” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. పవిత్రంగా భావించే అన్నవరం ప్రసాదాన్ని ఈ విధంగా అశ్రద్ధగా నిర్వహించడం ఏమిటని భక్తులు మండిపడుతున్నారు.