టోల్‌ కోసం వాహనం ఆపనవసరం ఉండదు…‌చెల్లింపునకు ఏడాదిలో సరికొత్త వ్యవస్థ… కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి —

.భారత్ న్యూస్ హైదరాబాద్….టోల్‌ కోసం వాహనం ఆపనవసరం ఉండదు…‌చెల్లింపునకు ఏడాదిలో సరికొత్త వ్యవస్థ… కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి —
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డులో ఇలాంటి వ్యవస్థ కొంత వరకు అమలు….

ప్రస్తుత టోల్‌ వసూలు వ్యవస్థకు ఏడాదిలోగా ముగింపు పలకనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీని స్థానంలో సరికొత్త ఎలక్ట్రానిక్‌ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. ‘జాతీయ రహదారులపై వాహనదార్లు టోల్‌ చెల్లించేందుకు వాహనాన్ని ఆపి, ఫాస్టాగ్‌ స్కాన్‌ అయ్యాక కదులుతోంది. నూతన విధానంలో వాహనం ఆగాల్సిన అవసరం లేకుండానే, చెల్లింపు జరుగుతుంది. కొత్త వ్యవస్థను ముందుగా 10 ప్రాంతాల్లో అమలు చేసి, ఏడాదిలోగా దేశవ్యాప్తంగా విస్తరిస్తామ’ని మంత్రి లోక్‌సభలో వెల్లడించారు.
భవిష్యత్తులో ఇలా… ఇటీవల విడుదలైన అధికారిక ఉత్తర్వు ప్రకారం, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్తగా నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఎన్‌ఈటీసీ) ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేసింది. ఎలక్ట్రానిక్‌ టోల్‌ చెల్లింపులకు ఇది ఒక విశిష్ట, ఇంటర్‌ ఆపరబుల్‌ ప్లాట్‌ఫాంగా పనిచేస్తుంది. టోల్‌ప్లాజాల వద్ద ఆగకుండానే, వాహనం విండ్‌స్క్రీన్‌పై ఉండే ఫాస్టాగ్‌ నుంచి ఆటోమేటిక్‌ టోల్‌ చెల్లింపులను ఇది వసూలు చేయగలదు. ‘ఏఐ అనలిటిక్స్‌తో, ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌తో పాటు ఆర్‌ఎఫ్‌ఐడీ ఆధారిత ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌( ఫాస్టాగ్‌) వంటి ఇంటిగ్రేటెడ్‌ సాంకేతికతలను వినియోగించి ఈ విధానాన్ని తీసుకువస్తు’న్నట్లు గడ్కరీ తెలిపారు.
ఇప్పటికే హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డులో ఇలాంటి వ్యవస్థ కొంతవరకు అమలవుతోంది.