వారి కోసం ఎంత కష్టపడ్డా వేస్టే: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు రాజాసింగ్ కీలక సూచన

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….వారి కోసం ఎంత కష్టపడ్డా వేస్టే: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు రాజాసింగ్ కీలక సూచన

ముస్లింల కోసం కష్టపడినా వారు ఓట్లు వేయరని రాజాసింగ్ వ్యాఖ్య

బీజేపీతో పొత్తు వల్లే ముస్లింల ఓట్లు కూటమికి రావన్న రాజాసింగ్

మీ శక్తిని హిందువుల కోసం ఉపయోగించాలని సూచన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు తెలంగాణకు చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక కీలకమైన సలహా ఇచ్చారు. మైనారిటీల ఓట్ల కోసం ఆశలు పెట్టుకోవద్దని, వారి కోసం ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు. మీరు బీజేపీతో పొత్తులో ఉన్నందున ముస్లింల ఓట్లు మీకు దక్కవని ఆయన అన్నారు.

తాజాగా రాజాసింగ్ మాట్లాడుతూ… “దేశవ్యాప్తంగా ముస్లింలు బీజేపీని తమ ప్రధాన శత్రువుగా భావిస్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లు వంటి నిర్ణయాల కారణంగా వారు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు” అని వివరించారు. ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, టీడీపీ-జనసేన కూటమికి ముస్లింల ఓట్లు రావడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

అందువల్ల, మీ సమయాన్ని, శక్తిని హిందువుల సంక్షేమం కోసం వినియోగించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు రాజాసింగ్ సూచించారు. “ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలను పరిరక్షించండి, జరుగుతున్న మతమార్పిడులను కఠినంగా అరికట్టండి. మీరు హిందూ ధర్మం కోసం పనిచేస్తే, హిందువులే మిమ్మల్ని తిరిగి అధికారంలోకి తీసుకువస్తారు” అని ఆయన అన్నారు. హిందువుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే రాజకీయంగా లబ్ధి పొందగలరని ఆయన పేర్కొన్నారు.