నేనే వస్తా’.. రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.నేనే వస్తా’.. రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్..

హైదరాబాద్, డిసెంబర్ 21: చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటూ కాంగ్రెస్ సర్కార్‌కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్‌ సర్కార్‌పై డైరెక్ట్ వార్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని.. తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. రెండేళ్లు ఆగామని.. ఇకపై ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తామన్నారు. బహిరంగ సభలు పెడతామని.. జనంలోకి తానే నేరుగా వస్తానని ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని కేసీఆర్ ప్రకటించారు. ఇంట్లోకి వచ్చి దోచుకుపోతామంటే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు.

ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలే తప్ప.. వేరే ధ్యాసే లేదని కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. సర్కార్ విధానాలను ఎక్కడికక్కడ నిలదీస్తామని.. అన్యాయాలపై ప్రశ్నిస్తామన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లు కొనే దిక్కు లేదు.. యూరియా ఇచ్చే సిస్టమ్ లేదని రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగమాగం చేస్తుందన్నారు. వీరి పాలనా విధానాలు గమనిస్తుంటే.. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా? నిద్రపోతుందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎంతసేపు భూములు అమ్ముకుందామనే యావలోనే ఉంటే ఎలా? అంటూ కాంగ్రెస్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడతామని, ఉద్యమాలు చేపడతామన్నారు. భారీ బహిరంగ సభలు పెడతామని.. తాను ఆ సభకు హాజరవుతానని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. ప్రభుత్వం నోరుమూసుకుని ఉంటుందని.. అందుకే తాము ముందడుగు వేస్తామన్నారు.

‘ఇవాళ్టి వరకు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క.. ఎక్కడికక్కడ నిలదీస్తా.. తోలు తీస్తాం. మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. మేం ఉద్యమించక తప్పదు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం. జలదోపిడీ విషయంలో పోరాటాలు చేస్తాం. రాష్ట్ర హక్కును రక్షించుకోవడానికి ఫైట్ చేస్తాం. కళ్ల ముందు ఇదంతా జరుగుతుంటే మౌనంగా ఉండాలి, ఇష్టానుసారం మాట్లాడుతామంటే కుదరదు. ఇక నుంచి ప్రత్యక్ష పోరాటం చేస్తాం’ అని కేసీఆర్ రాజకీయ యుద్ధం ప్రకటించారు.

నదీ జలాల కోసం మరో ఉద్యమం.. కేసీఆర్ షాకింగ్ కామెంట్స్

సమైక్యాంధ్రలో మహబూబ్‌నగర్‌ జిల్లా వివక్షకు గురైందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమైక్యాంధ్రలో కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కలిసి మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టుకు ద్రోహం చేశాయని ధ్వజమెత్తారు. తెలంగాణ నదీ జలాలకు బీఆర్ఎస్‌ మాత్రమే శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. తెలంగాణపై ఆర్తి బీఆర్ఎస్‌కు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు మరో ఉద్యమం చేపడదామని పిలుపునిచ్చారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కేసీఆర్.

ఈ సమావేశంలో పాలమూరుకు జరిగిన ద్రోహంపైనే చర్చించామని అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, 20 ఏళ్లు పాలించిన టీడీపీ.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు ద్రోహం చేశాయని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో కృష్ణా నది 300 కిలోమీటర్లు ప్రవహిస్తోందని వివరించారు. 174 టీఎంసీలు మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టులకు రావాల్సి ఉందని తెలిపారు. విభజనతో మహబూబ్‌నగర్‌‌కు చాలా నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రతిపాదిత ప్రాజెక్టులను మార్చొద్దని SRCలో స్పష్టంగా ఉందని తెలిపారు. ఈ విషయంపై బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌కి కూడా అనేకసార్లు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు కేసీఆర్.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీని అసెంబ్లీ వేదికగా ప్రశంసించామని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచానని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని కూడా కాంగ్రెస్‌ సర్కార్ ఎందుకు నిలిపివేసిందని నిలదీశారు. బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ రైతులను రాచి రంపాన పెడుతోందని మండిపడ్డారు. రైతులకు నీళ్లు ఇచ్చే చెక్‌ డ్యామ్‌లను పేల్చివేయడం దారుణమని వాపోయారు. తాము అధికారంలోకి వచ్చాక కూల్చినవాళ్లు పాతాళంలో ఉన్నా పట్టుకువస్తామని హెచ్చరించారు కేసీఆర్.

తమ హయాంలో పాలమూరు, నల్లగొండ జిల్లాలను అద్భుతంగా తీర్చిదిద్దామని వ్యాఖ్యానించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పడావు పెట్టారు? అని ప్రశ్నించారు. ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని.. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై మండల, జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీ పడిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు ఆవేశంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్షంగా మన బాధ్యతను నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. మరో 20 రోజుల్లో పాలమూరులో భారీ బహిరంగ సభ పెడతామని కేసీఆర్ పేర్కొన్నారు.