రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ(గురువారం) దర్శించుకున్నారు. కవితకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో కవిత మాట్లాడారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా తాను రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు. పార్టీ పెడితే తనకు కాదని.. ప్రజలకు మేలు జరగాలని ఉద్ఘాటించారు కవిత.

తెలంగాణ జాగృతి.. సివిల్ సొసైటీ సంస్థ అయినప్పటికీ అవసరమైతే రాజకీయాల గురించి తాను పుష్కలంగా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. రాజకీయాల గురించి తెలంగాణ జాగృతి తరఫున మాట్లాడాలంటే రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తానని… అందులో ఇబ్బందేమీ లేదని పేర్కొన్నారు. ఏపీలో మూడు, తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని తెలిపారు. కేరళలో గల్లీకి ఒక పార్టీ ఉందని గుర్తుచేశారు. పార్టీలు ఉండటం పెద్ద విషయం కాదని… ఆయా పార్టీలతో ప్రజలకు మేలు జరగాలని సూచించారు కవిత.

తాను చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజాభిప్రాయం తెలుసుకోవటానికే ‘జనం బాట’ కార్యక్రమం నిర్వహిస్తున్నానని తెలిపారు. ఎల్లుండి నుంచి 4నెలల పాటు ‘జనం బాట’ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటానని వెల్లడించారు. ‘జనం బాట’ (Janam Baata) కార్యక్రమానికి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల కోసమే తాను ఇక్కడకి వచ్చానని చెప్పుకొచ్చారు. మొన్న తిరుపతి, ఇప్పుడు యాదాద్రి దేవాలయాలను దర్శించుకున్నానని తెలిపారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకునే శక్తి దేవుడు తనకు ఇవ్వాలనే దైవ దర్శనం చేసుకుంటున్నానని వివరించారు కవిత.

ఈ నెల 25వ తేదీన తమ సొంతూరు నిజామాబాద్ నుంచి ‘జనం బాట’ కార్యక్రమం ప్రారంభిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమం 33జిల్లాల్లో 4నెలలు పాటు జరుగుతుందని వివరించారు. తాను ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఉంటానని.. అక్కడి సమస్యలు తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు. మేధావులు, విద్యావంతులు, రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలను కలుస్తానని వెల్లడించారు. ప్రజాసమస్యలను ఏవిధంగా పరిష్కారం చేయాలనే విషయంపై దృష్టి పెడతానని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ యాదాద్రిని చక్కగా పునర్నిర్మించారని ఉద్ఘాటించారు కవిత.

యాదాద్రి గుడి ప్రాశస్థ్యాన్ని కాపాడే విధంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని సూచించారు. తాను ఇవాళ యాదాద్రి ఆలయానికి వస్తుంటే విచిత్రమైన హోర్డింగ్‌లను చూశానని… అలాకాకుండా తిరుమలలో మాదిరిగా స్వామి వారి హోర్డింగ్‌లు, చిత్రపటలే ఇక్కడ ఉండేలా చూడాలని కోరారు. మళ్లీ యాదాద్రికి తాను వస్తానని… అప్పుడు ఇక్కడున్న అన్ని సమస్యలపై వివరంగా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. తెలంగాణ జాగృతి ఎన్జీవోగా ఆవిర్భవించి 19ఏళ్లుగా కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాజకీయాలు, రాజకీయ సమీకరణాల గురించి తాను మాట్లాడానని పేర్కొన్నారు కవిత.. KP