భారత్ న్యూస్ ఖమ్మం…..మధిర నియోజకవర్గం పర్యటనలో భాగంగా బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణం అవుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
ఈ సందర్భంగా నిర్మాణ దశలో ఉన్న భవన సముదాయాలను స్వయంగా సందర్శించి పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు, గుత్తేదారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
జూనియర్ హాస్టల్, జూనియర్ మరియు సీనియర్ అకాడమిక్ భవనాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అలాగే మెకానికల్, సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ల్యాబ్ భవనాల నిర్మాణాన్ని కూడా సమగ్రంగా పరిశీలించారు.
విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. విద్య కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి భవిష్యత్ తరాల నిర్మాణానికి చేసే పెట్టుబడిగా ఆయన అభివర్ణించారు.

నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులను ఆదేశించిన ఆయన, ఈ పాఠశాలలు కేవలం భవనాలు మాత్రమే కాకుండా రేపటి తరాలను తీర్చిదిద్దే దార్శనిక దేవాలయాలుగా నిలవాలని పేర్కొన్నారు.