ఇక కేంద్రం ఆధీనంలోకి ‘ఉపాధిహామీ పధకం ‘

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇక కేంద్రం ఆధీనంలోకి ‘ఉపాధిహామీ పధకం ‘

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోనుంది.

రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ సైతం ఉండకుండా ‘కేంద్రం’ అంతా తానై పథకాన్ని నడపనుంది. ఉపాధి హామీ పథకానికి ఏటా కేంద్రం బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తోంది. అయితే, నిధుల ఖర్చు, పనుల గుర్తింపు తదితర వాటిని అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది. దీంతో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలున్నాయి.ఈ క్రమంలో అక్రమాలు అరికట్టి పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ‘యుక్తధార్‌’ పేరిట యాప్‌ తీసుకొ చ్చింది. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలోని 31 మండలాల్లో మండలానికి ఒక పంచాయతీ చొప్పున 31 చోట్ల ‘యుక్తధార్‌’ పోర్టల్‌ ద్వారా ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు.యాప్‌పై అవగాహన కల్పించేందుకు ఉపాధి హామీ సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సదస్సులను నిర్వహిస్తున్నారు.

సర్వం యాప్‌ ద్వారానే..

ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న ఉపాధి పనుల గుర్తింపు దగ్గర నుంచి పనులకు వచ్చే కూలీల వివరాలు, బిల్లుల చెల్లింపులు తదితరాలన్నీ ‘యుక్తధార్‌’ యాప్‌ ఆధారంగానే జరగనున్నాయి. జియోస్పేషియల్‌ ప్లానింగ్‌ పోర్టల్‌కు అనుగుణంగా ‘యుక్తధార్‌’ పనిచేస్తుంది. ఈ క్రమంలో ఉపాధి పనులను గుర్తించిన అనంతరం వాటిని జియోట్యాగ్‌ ద్వారా యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. పనులకు వచ్చే కూలీల వివరాలు సైతం పొందుపరచాలి. జియోట్యాగ్‌ చేసిన పనుల వద్దే కూలీల ఫొటోలను తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ క్రమంలో అవకతవకలకు తావుండదు. కూలీలకు వేతనాలు కూడా త్వరగా విడుదలవుతాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలతో గ్రామ పంచాయతీల్లో ప్రణాళికలు సులభతరం కానున్నట్లు డ్వామా అధికారులు చెబుతున్నారు.

అక్రమాలను అరికట్టేందుకు చర్యలు

ప్రత్యేకంగా ‘యుక్తధార్‌’ యాప్‌

పనుల గుర్తింపు, బిల్లుల చెల్లింపులు సైతం యాప్‌ ద్వారానే..

31 పంచాయతీల్లో యుక్తధార్‌ ద్వారా పనులు

పైలట్‌ ప్రాజెక్టు కింద జిల్లా వ్యాప్తంగా ఉన్న 31 మండలాల్లో మండలానికి ఒక పంచాయతీ చొప్పున 31 గ్రామ పంచాయతీల్లో ‘యుక్తధార్‌’ పోర్టల్‌ ద్వారా ఉపాధి హామీ పనులను చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యుక్తధార్‌ యాప్‌నకు అనుసంధానం చేసింది. పనుల గుర్తింపు దగ్గర నుంచి బిల్లుల చెల్లింపు వరకూ అన్ని వివరాలు ఈ యాప్‌ ద్వారానే నడవనున్నాయి. వచ్చే నెలలో పూర్తిస్థాయిలో అన్ని పంచాయతీల్లో అమలు చేయనున్నారు.