సైబరాబాద్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్:

సైబరాబాద్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఈరోజు., 26.01.2026, 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్., జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. 1947 ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటపై భారత జాతీయ జెండా ఎగరవేసిన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేశారు. అలాగే 1949 నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగాన్ని ఆమోదించుకుని, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపుదిద్దుకుని, 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చిందని వివరించారు.

భారత రాజ్యాంగం వల్లే ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు లభిస్తున్నాయని సీపీ తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవులన్నీ ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధుల ద్వారానే నిర్వహిస్తున్నారని, ఇదే ప్రజాస్వామ్యానికి పునాదని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది కూడా రాజ్యాంగ పరిమితుల్లోనే తమ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళా సాధికారత, మహిళల ఓటు హక్కు వంటి హక్కులను రాజ్యాంగమే కల్పించిందన్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్ సహా పలు దేశాల్లో రాజకీయ అస్థిరతలు, తిరుగుబాట్లు కనిపిస్తున్నప్పటికీ, భారతదేశం సురక్షితంగా నిలబడటానికి దృఢమైన రాజ్యాంగమే ప్రధాన కారణమని సీపీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థలు రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజల హక్కులను రక్షిస్తున్నాయన్నారు.

ఈ సందర్భంగా అతి ఉత్కృష్ట, ఉత్కృష్ట సేవా పథకాల్లో ప్రతిభ కనబర్చిన సైబరాబాద్ పోలీస్ సిబ్బందిని సీపీ అభినందించారు. అలాగే రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం “పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ” అవార్డు పొందిన హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డిని సీపీ అభినందించి సన్మానించారు. అలాగే నలుగురికి అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. వీరిలో రిటైర్డ్ రోడ్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఎల్ సీ నాయక్‌, ఎస్‌ఐ షేక్ అబ్దుల్లా (మైలార్దేవ్‌పల్లి పీఎస్), ఏఎస్‌ఐ కె. రవీందర్ రెడ్డి (రాజేంద్రనగర్ ట్రాఫిక్ పీఎస్), ఏఎస్‌ఐ పొల్లంగారి సత్యనారాయణ రెడ్డి (మైలార్దేవ్‌పల్లి పీఎస్)లకు ఈ పతకాలను ప్రదానం చేశారు.

అలాగే ఉత్కృష్ట పతకాలకు ఎంపికైన 11 మంది పోలీస్ సిబ్బందికి పతకాలు ప్రదానం చేశారు. వీరిలో గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ ఇన్ స్పెక్టర్ గోనె సురేష్, ట్రాఫిక్ కంట్రోల్‌ రూమ్ హెడ్ కానిస్టేబుల్ కె. నాగేశ్, ఫింగర్ ప్రింట్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ కుమ్మరి సురేందర్, కానిస్టేబుళ్లు అవుసుల పురుషోత్తం, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ (ఎo టీ); లింగాల కరుణాకర్, షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌; ఎం. యాదయ్య, ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌; సిద్ధాపురం చంద్రశేఖర్, ఆర్‌టీఏఎం సెల్‌; కె. కిషోర్ బాబు, సీటీసీ సైబరాబాద్‌; రాజమోని జనార్ధన్, ఈ–చలాన్ విభాగం; ఇ. కృష్ణయ్య, ఆర్‌టీఏఎం సెల్‌; గొల్ల ప్రవీణ్ కుమార్‌, ఆర్‌టీఏఎం సెల్‌ సీపీ చేతుల మీదుగా పతకాలు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డీసీపీ సి.హెచ్. శ్రీనివాస్, ఐపీఎస్., కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, ఐపీఎస్., అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, ఐపీఎస్., క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, డబ్ల్యూ & సీఎస్‌డబ్ల్యూ డీసీపీ సృజన కరణం, ఎస్ఓటీ డీసీపీ శోభన్ కుమార్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, ఏడీసీపీలు, ఏసీపీలు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, చీఫ్ అడ్మిన్ ఆఫీసర్ గీత, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, ఇన్ స్పెక్టర్లు, మినిస్టీరియల్ స్టాఫ్, వివిధ సెక్షన్ ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.