
ఒక ఊర్లో విపరీతంగా కరవు సంభవించింది. ఆ సమయంలో ప్రజలకు తినడానికి కాస్తంత కూడా ధాన్యం, నీళ్లు లేని పరిస్థితి.. అలా రోజులు గడుస్తున్నాయి. చిన్నపిల్లలు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల తల్లిదండ్రులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఒక సాధువు ఆ ఊరి రాజుకు ఒక ఉపాయం చెప్పాడు. ఈ ఊరి ఆకలి తీరాలంటే.. రోజూ సరిపడ ఆహారం అందరికి అందాలంటే.. ఈ రాజ్యంలోని వృద్ధులను (వయసు మళ్లిన తల్లిదండ్రులు) వదిలించుకోవాలి అని అంటాడు.
ఆ మేరకు రాజు ఊర్లో ఆజ్ఞ చేస్తాడు.
ఆ మేరకు ఒక సామాన్యుడు ఏం చేయలేని పరిస్థితిలో తన పిల్లలను కాపాడుకోవడానికి తన తల్లిని వదిలించుకోవాలనుకుంటాడు.
ఇక ఆ విషయం ఆ తల్లికి చెప్పకుండా ఆమెను భుజాన వేసుకొని బయలుదేరుతాడు. ఊరికి దూరంగా ఉన్న కొండలపై, కోనలపై తిరుగుతూ.. గుర్తుపట్టలేని దూర ప్రదేశాలకు వెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో ఆ అవ్వ అడుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నామని.. కానీ అతడు అవ్వకు నిజం చెప్పడు. అక్కడ వేరే ప్రదేశంలో పని ఉందని సర్దిచెబుతూ వెళ్తాడు. దారి మధ్యలో వెనకవైపు చిన్న శబ్దం వస్తూ ఉంటుంది. అయినా అతడు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తూనే ఉంటాడు. అలా సాయంకాలం అవుతుంది. కాకులు దూరని కారడివిలా ఉంటుందా ప్రదేశం. అక్కడ ఆ అవ్వని కిందకు దించి అసలు విషయం చెబుతాడు.
అవ్వా రాజ్యంలో కరవు తాండవించింది కదా.. తినడానికి ఇంట్లో అందరికి సరిపడ ఆహారం లేదు. అందుకే వయసు మళ్లిన వాళ్లను వదిలించుకోవాలని రాజు ఆజ్ఞ..
అందుకే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాను. నేను నిన్ను ఇక్కడే విడిచి వెళ్లిపోతున్నా.. అంటాడు.
ఆ మాటలకు ఆ తల్లి చలించకుండా ఓ మాట అంటుంది.. ‘నువ్వు నాకు ఈ విషయం అక్కడే చెప్పి ఉంటే.. నేను అక్కడే ప్రాణాలు విడిచేదాన్ని అని’. ఆ మాటలకు కొడుకు చలించిపోతాడు. అయినా తప్పనిసరి తన పిల్లల బతుకు కోసం అవ్వను వదిలివెళ్లాని నిర్ణయించుకుంటాడు.
తిరుగు పయనంలో వెనక్కి తిరిగి చూస్తాడు. ఎటు వచ్చానో దారి తెలియదు కొడుక్కి.. అప్పుడు ఆ అవ్వ అంటుంది. ‘మనం వచ్చిన దారి వెంట ఆకులు, చెట్టు కొమ్మలు కింద పడి ఉంటాయి. నేనే వాటిని విరుచుకుంటూ వచ్చాను. నువ్వు తిరిగి వెళ్లేటప్పుడు దారి మరిచిపోకుండా ఉంటావని అలా చేశాను అంటోంది. నీ బిడ్డల బతుకు నీకు ఎంత ముఖ్యమో.. నా కొడుకు బతుకు నాకు ముఖ్యం అని.. ఆ మాటలకు అవ్వకు నేను ఒక కొడుకునని జ్ఞానోదయం అవుతుంది.
ఇది కదా తల్లి ప్రేమ..
ఈ లోకంలో చెడ్డ అమ్మాయి ఉందేమోగానీ.. చెడ్డ తల్లి ఉండదు.
హ్యాపీ మదర్స్ డే.