భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…కోరలు చాస్తున్న ర్యాగింగ్ విష సర్పం
మంగళగిరి ఎయిమ్స్‌లో సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక ఓ జూనియర్ వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది.
ఇందుకు బాధ్యులైన 13 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసిన యాజమాన్యం. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిలో ఎయిమ్స్ డీన్ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిలో ముగ్గురు సీనియర్ విద్యార్థులను ఏడాదిన్నర (3 సెమిస్టర్లు) సస్పెండ్ చేసి, రూ.25 వేలు చొప్పున జరిమానా విధించారు. మరో ఆరుగురిని సంవత్సర కాలం (2 సెమిస్టర్లు) సస్పెండ్ చేస్తూ రూ.25 వేలు చొప్పున జరిమానా విధించారు. మిగిలిన నలుగురిని ఆరు నెలలు (ఒక సెమిస్టర్) సస్పెండ్ చేస్తూ రూ.25వేల జరిమానా విధించి.. వారిని వసతిగృహం నుంచి ఖాళీ చేయించారు. ఈ వ్యవహారం మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. తిరుపతికి చెందిన విద్యార్థి ఏడాదిగా మంగళగిరి ఎయిమ్స్‌లో వైద్య విద్య చదువుతున్నారు.

గతనెల 22న వసతి గృహంలో తన స్నేహితుడితో మాట్లాడుతుండగా సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఓ దశలో బాగా ఇబ్బంది పెట్టడంతో వేధింపులు భరించలేక ఆ విద్యార్థి బ్లేడుతో చేయి కోసుకున్నాడు. ఈ ఘటనపై అదే రోజు ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. మంగళగిరి ఎయిమ్స్ యాజమాన్యం వివరణ కోరుతూ 23న అక్కడి నుంచి మెయిల్ రావడంతో అంతర్గత విచారణ చేపట్టారు. ర్యాగింగ్ నిరోధక కమిటీ జరిపిన విచారణలో ప్రాథమికంగా 15 మందిని బాధ్యులుగా తేల్చారు. దీంతో గతనెల 24న బాధ్యులైన 15 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. తర్వాత జరిపిన సమగ్ర విచారణలో 13 మంది పాత్ర మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు స్వస్థలానికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై గతనెల 24నే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎయిమ్స్ వర్గాలు చెబుతుంటే.. తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని.. అందుకే కేసు నమోదు చేయలేదని మంగళగిరి గ్రామీణ పోలీసులు చెబుతున్నారు.