.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యా వ్యవస్థను మరింత మెరుగ్గ మార్చాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ (iDEA) ఏర్పాటుకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU), కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) అధ్యక్షుడు, సీఈఓ ప్రొఫెసర్ పీటర్ స్కాట్ గారు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
ఈ ఒప్పందంతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందనుంది. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి iDEA అత్యాధునిక డిజిటల్ హబ్‌గా పనిచేస్తుంది. టెక్నాలజీ ద్వారా నాణ్యమైన విద్య అందించేందుకు వీలు కలుగుతుంది.

ఈ సమావేశంలో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) అధ్యక్షుడు, సీఈఓ ప్రొఫెసర్ పీటర్ స్కాట్ గారు, ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు, BRAOU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.