భారత్ న్యూస్ తిరుపతి.చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన
సురక్షితంగా ఉన్నచిన్నారి
ఆరుగురు నిందితుల అరెస్ట్
తిరుపతి, జనవరి 24
తిరుపతి నగరం చింతలచేను ప్రాంతంలో సంచలనం సృష్టించిన చిన్నారి కిడ్నాప్ కేసును తిరుపతి జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ ఘటనలో కిడ్నాప్ అయిన ఒక సంవత్సరం మూడు నెలల వయస్సు గల చిన్నారి జయశ్రీని సురక్షితంగా స్వాధీనం చేసుకొని, ఈ నేరానికి పాల్పడిన ఆరుగురు నిందితులను తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా విడదంబట్టు ప్రాంతంలో అరెస్టు చేశారు. ఈనెల 21వ తేదీన చింతలచేను ప్రాంతంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి జయశ్రీ అపహరణకు గురైంది. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న జిల్లా పోలీస్ అధికారులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణను ముమ్మరం చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మారియమ్మ, కందన్ @ మురుగన్ భార్యాభర్తలతో పాటు మరికొందరు ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుల కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తూ ప్రత్యేక బృందాలు తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా విడదంబట్టు పట్టణానికి చేరుకొని, ఈ కేసులో సంబంధం ఉన్న మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితులు చిన్నారిని రైలులో కాట్పాడి నుంచి ఈరోడ్ వరకు తీసుకెళ్లి భిక్షాటన చేయించినట్లు, అనంతరం చిన్నారిని విక్రయించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి జయశ్రీని సురక్షితంగా స్వాధీనం చేసుకున్న పోలీసులు, కిడ్నాపర్లతో పాటు చిన్నారిని కొనుగోలు చేసిన కుటుంబాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.25,271 నగదు మరియు టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్టు అయిన నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు అదనపు ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, చిన్న పిల్లలను ఒంటరిగా వదలరాదని, అపరిచితులను నమ్మి అప్పగించవద్దని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
