V.C. సజ్జనార్, IPSఅదనపు డీజీపీ

భారత్ న్యూస్ హైదరాబాద్….V.C. సజ్జనార్, IPS
అదనపు డీజీపీ

……

ఆర్టీసీతో నాలుగేళ్ళ నా ప్రయాణం ముగిసింది.

ప్రియమైన టీజీఎస్ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు!! నేను తేది 03.09.2021 నాడు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆర్టీసీకి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాను. మీ అందరి సహాయ సహకారాల వల్ల నాలుగేళ్లకు పైగా ఈ పోస్టింగ్‌లో కొనసాగాను. నేను బాధ్యతలు స్వీకరించేనాటికి సంస్థ చాలా క‌ష్ట‌కాలంలో ఉంది. ఆ సమయంలో ఆర్థిక లోటుతో సంస్థ మనుగడ ఉంటుందా? లేదా? అనే భయం అందరిలోనూ గూడుకట్టుకుని ఉంది. 

అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి సంస్థను బయటికి తీసుకువచ్చేందుకు అందరి అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని.. ఉన్నతాధికారులు, ఆర్థిక  నిపుణులతో చర్చించాం. అనేక మేధోమథన సదస్సులు నిర్వహించి.. ప్రతి ఉద్యోగిని సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం చేశాం. వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్లాం. ‘కృషితో నాస్తి దుర్బిక్షం’ అన్న నానుడిని అందరం కలిసి నిరూపించాం. ఈ నాలుగేళ్లు అనేక ఒడిదొడుకులతో మ‌న ప్ర‌యాణం సాగిన‌ప్ప‌టికీ.. మీ అందరి సంపూర్ణ మద్దతుతో సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చగలిగాము.  మీ సహకారంతో అనేక కీలక సంస్కరణలను అమలు చేశాం. పాత బస్సులను కొత్త బ‌స్సుల‌తో రిప్లేస్ చేయ‌డం, ఏడాదికి రూ. 9000 కోట్లకు పైగా రాబ‌డి సాధించడం, కార్పొరేట్‌కు దీటుగా తార్నాక ఆస్ప‌త్రిని తీర్చిదిద్దడం,  గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌ల నిర్వ‌హ‌ణ, శిక్షణ కార్యక్రమాల ద్వారా  మిమ్మ‌ల్ని సాధికారత చేయడం వంటి వినూత్న కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాం. మీ అందరి కృషి, పట్టుదలతో పాటు నిబద్దత, అంకితభావంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని నేను గర్వంగా చెబుతున్నాను.

గత నాలుగేళ్ల కాలంలో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటూనే.. ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేయ‌డం జ‌రిగింది. నేను మొదట మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదిన జీతాలు ఇస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న, 2017కు సంబంధించిన 21 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రకటించి.. ఇచ్చాం. పెండింగ్ లో ఉన్న డీఏలన్నింటినీ దశల వారీగా చెల్లించాం.

ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆరోగ్యంగా ఉంటుందని భావించి.. నాలుగేళ్లలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ను మూడు సార్లు నిర్వహించాం. 44 వేల ఉద్యోగుల హెల్త్ ఫ్రొఫైల్స్‌ను రూపొందించాం. ఉద్యోగుల జీవిత భాగ‌స్వాముల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయించాం. ఈ ఛాలెంజ్‌లలో వైద్య పరీక్షలు చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలున్న సుమారు 1000  మంది ఉద్యోగుల, వారి జీవిత భాగ‌స్వాముల ప్రాణాలను కాపాడుకున్నాం. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిని కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా రూపొందించుకుని.. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించిన 48 గంటల్లో మనం అమలు చేశాం. ప్రతి రోజు సగటున 35 లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ ను వినియోగించుకుంటున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో ఆర్టీసీ తిరిగి తన కాళ్లపై తాను నిలబడేలా కృషి చేశాం. సంస్థ ప్రకటించిన ప్రతి ఛాలెంజ్ ను విజయవంతం చేశాం. ఈ మహాయజ్ఞంలో నాతో కలిసి పనిచేసిన ప్రతి అధికారికి, ఉద్యోగికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిజేస్తున్నాను.  గతంలోనూ మీరే సంస్థలో విధులు నిర్వర్తించారు. అప్పుడు ఇప్పుడూ సంస్థలో ఎంత తేడా వచ్చిందో మీకు తెలియనిది కాదు. 

ఒక మహాకవి చెప్పినట్లుగా ‘ఎవరో వస్తారని, ఎదో చేస్తారని, ఎదురుచూసి మోసపోకుమా’ అన్నది నిజం. సంస్థలోని ప్రతి ఉద్యోగి కూడా ఈ సంస్థ నాది అనే భావనతో శక్తివంచన లేకుండా అంకితభావంతో ప్రతి క్ష‌ణాన్ని ఒక సవాల్ గా తీసుకుని ముందుకెళ్లాలి. ప్రయాణికులకు మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలను అందించి వారి మన్ననలు పొందినట్లైతే, సంస్థ రాబోయే కాలంలో ఎంతో వృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది. ‘ప్రయాణికులే మన సంస్థకు దేవుళ్లు’ అనే విషయం ఎప్పుడు మన హృదయాల్లో నాటుకుపోవాలి. ప్రయాణికుల పట్ల చాలా గౌరవంతో మెలగాలి. 

చివరగా.. ఆర్టీసీకి పరిమిత కాలంలో అపరిమిత పేరు ప్రతిష్ఠలు దక్కడంలో మనమంతా చేయి చేయి కలిపి పనిచేశాం. భవిష్యత్‌లోనూ మీరంతా ఇలానే పనిచేస్తూ దేశంలోనే అత్యున్నత రవాణా సంస్థగా.. మన టీజీఎస్ఆర్టీసీని నిలబెడతారని ఆశిస్తున్నాను. ఆర్టీసీతో నాలుగేళ్ల ఈ పయనం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది.  భ‌విష్య‌త్‌లో నేను ఎక్క‌డ ఉన్నా ప్రజా రవాణా వ్యవస్థవ్య‌వ‌స్థ‌కు, ఈ గొప్ప సంస్థ‌కు నా మద్దతు కొనసాగుతుంది. ప్రజలకు రవాణా సేవలందించే ఈ గొప్ప సంస్థలో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నాకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ..