కుప్పంలో మహిళపై దాడి

భారత్ న్యూస్ అనంతపురం .. …చిత్తూరు జిల్లా కుప్పం :

కుప్పంలో మహిళపై దాడి

అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఘటన

కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళలను హింసించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లా కుప్పం పురపాలక పరిధిలోని నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం భరించలేక ఊరు విడిచిపెట్టి వెళ్లిపోగా.. అతని భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని పోషిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు వచ్చిన శిరీషను మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి పట్టుకొని.. భర్త తీసుకున్న డబ్బు చెల్లించాలని ఆమెతో వాగ్వాదానికి దిగారు. శిరీషను చెట్టుకు కట్టి దాడి చేయగా.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.