మహిళలను అవమానిస్తారా – వెంకయ్య నాయుడు సీరియస్….

భారత్ న్యూస్ అనంతపురం .. ….Ammiraju Udaya Shankar.sharma News Editor…మహిళలను అవమానిస్తారా – వెంకయ్య నాయుడు సీరియస్….

సాక్షి ఛానెల్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలతో పోల్చడం పట్ల కృష్ణంరాజుతోపాటు జగన్ , భారతిరెడ్డిలు కూడా క్షమాపణలు చెప్పాలని మహిళలు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కృష్ణంరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా కొమ్మినేని ఖండించకపోవడం పట్ల సాక్షి యాజమాన్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే ఏపీ అంతటా సాక్షి కార్యాలయాల వద్ద మహిళలు నిరసనకు దిగారు.

ఈ ఉదంతంపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. ఏపీ రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవి. సభ్యసమాజం సహించలేనివని ఎక్స్ వేదికగా ఆయన స్పష్టం చేశారు.

కేవలం ఒక్క ఎకరా భూమి ఉన్న రైతులు సైతం రాజధాని కోసం భూములు ఇవ్వడమే గాక, తదనంతర కాలంలో తమ మీద జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారు. అమరావతి ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా, ప్రవృత్తిగా జీవనం సాగిస్తూ… భవిష్యత్ తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరుపమానమైనవి. అలాంటి రైతులను, ముఖ్యంగా మహిళా మూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవి. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం. ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు వెంకయ్య నాయుడు.