భారత్ న్యూస్ గుంటూరు…(ఏప్రిల్ 11 – 2026) — ఏంటి గోంగూర నువ్వు చెప్పేది…అని అనుకోవద్దు….
గోంగూర గురించి చెప్పాలంటే చాలా ఉంది. గో గో గో గోంగూర.. జై జై జై ఆంధ్రా.. అంటూ ఎన్టీఆర్ దేవాంతకుడు సినిమాలో ఓ పాట ఉంది. అంటే అందరూ జై కొట్టాల్సినంత గొప్పదనం గోంగూరకి ఉంది. ఆకుకూరల్లో గోంగూరకో విశిష్ట స్థానం ఉంది. దీనికి యుగయుగాల చరిత్ర ఉంది. రామాయణంలో సీతారాముల వనవాస ఘట్టంలో గోంగూర ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణ తులాభారం ఘట్టంలో .. అదెంత భాగ్యం గోంగూర.. అని సత్యభామ అంటుంది. నలుడు తన పాకశాస్తంలో పేర్కొన్న పాతిక రకాల పులుపులలో గోంగూర ఒకటి. ఒక్కో పులుపుకి ఒక్కో రుచి ఉంటుందని చెబుతూ గోంగూర రుచి చాలా ప్రత్యేకమని చెబుతాడు. జానపద సాహిత్యంలో గోంగూరకి సముచిత స్థానం ఉంది. కోడలా కోడలా నీ పెత్తనం ఎన్నాళ్ళే.. అంటే.. మా అత్త గోగుతోట నుంచి వచ్చేదాకా.. అందట. ఇది బాగా వాడుకలో ఉన్న అలనాటి సామెత. గోంగూర కి సంబంధించిన సామెతలు చాలానే ఉన్నాయి. మాయాబజార్ వివాహభోజనంబు పాటలో గోంగూర ప్రస్తావన పరోక్షంగా ఉంది. గోంగూర పేరుకి కూరే గాని పచ్చడిగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. గోంగూర పచ్చడిలో వెల్లుల్లిపాయలు, మిరప్పళ్ళు మిక్స్ చేసి నెయ్యి కలుపుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే.. నా సామి రంగా.. అనాల్సిందే.. రుచి అమోఘమే. గుంటూరు మండలం గోంగూరకి ప్రసిద్ధి. గోగుతోటలో పచార్లు చేస్తే గోంగూర గాలి చాలా రొమాంటిక్ గా ఉంటుందని ఓ రచయిత పేర్కొన్నాడు. గోంగూరతో పులుసు చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ లలో గోంగూర బిర్యానీ కూడా దొరుకుతోంది. గోంగూర ఇనుము ఫైబర్ ఆరోగ్య ప్రదాయిని. ఆమధ్య జరిగిన థాయ్ ఫుడ్ మేళా లో ఇండియన్ వంటకాల్లో మన గోంగూర ఐటెం ఉండటం ఓ విశేషం. గోగునారని వంటచెరకుగా వాడతారు. గోంగూర నాన్ వెజ్ వంటలకి కూడా పనికొస్తుంది.. రుచిని పెంచేలా చేస్తుంది. గోగులు పూచే గోగులు పూచే ఓ లచ్చ గుమ్మాడీ.. అంటూ సి నారాయణరెడ్డి ముత్యాలముగ్గు సినిమాలో ఓ పాట రాశారు. ఇది తెలంగాణా జానపదానికి చెందినది. ఆకుకూరల్లో గోంగూరది ఓ సముచిత స్థానం. అన్ని ప్రాంతాల వారు ఆస్వాదించదగ్గ గోంగూర మన ఆంధ్రాకి చెందిన స్వచ్ఛమైన తెలుగు వంటకం….
