ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో మాధవ్ బేటీ ….మత్స్యకారులు, హోంగార్డుల సమస్యలపై వినతి..

.భారత్ న్యూస్ అమరావతి..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో మాధవ్ బేటీ ….
మత్స్యకారులు, హోంగార్డుల సమస్యలపై వినతి..

అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ కలసి మత్స్యకారులు మరియు హోంగార్డుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

నెల్లూరు, ఒంగోలు, బాపట్ల తీర ప్రాంతాల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు అక్రమంగా ప్రవేశించి స్థానిక మత్స్యకారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు. స్పీడ్ బోట్లతో వచ్చి మత్స్యసంపదను దోచుకోవడం, స్థానిక మత్స్యకారుల వలలు మరియు పడవలను ధ్వంసం చేయడం, దాడులకు పాల్పడటం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిణామాలతో స్థానిక మత్స్యకారుల్లో భయాందోళనలు పెరిగి, శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ప్రాంతంలో ఇలాంటి బోట్లను స్థానికులు పట్టుకున్నప్పటికీ, సంబంధిత అధికారుల నుండి కఠిన చర్యలు తీసుకోకుండా వాటిని విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.

ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, అక్రమంగా ప్రవేశించే బోట్లపై కఠిన చర్యలు తీసుకుని, తీరప్రాంత భద్రతను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు .

రాష్ట్ర విభజన తరువాత సుమారు 400 మంది హోంగార్డులు తమ స్వగ్రామాలకు దూరంగా పనిచేస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆంధ్రప్రదేశ్–తెలంగాణ మధ్య పరస్పర బదిలీలు చేపట్టాలని కోరారు.