భారత్ న్యూస్ గుంటూరు….అవనిగడ్డలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ

Ammiraju Udaya Shankar.sharma News Editor…అవనిగడ్డ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పులిగడ్డ నుంచి అవనిగడ్డ వరకు పురవీధుల్లో భారీ మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం అవనిగడ్డ రాజీవ్ గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎక్సైజ్ మరియు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు హాజరయ్యారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ముందుగా నారా లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు అండగా నిలుస్తూ నిత్యం అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడటమే లక్ష్యంగా కుప్పం నుంచి యువగళం పాదయాత్ర చేపట్టారని తెలిపారు. ఆ పాదయాత్రలో వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, అనుమతులు ఇవ్వకపోగా మైక్‌లు లాక్కోవడం, అనేక తప్పుడు కేసులు పెట్టడం జరిగిందని ఆరోపించారు. అయినా ధైర్యంగా పాదయాత్ర కొనసాగిస్తూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో కనీసం తండ్రిని చూడటానికి కూడా నారా లోకేష్‌కు అవకాశం ఇవ్వలేదని, అప్పుడు రోడ్డుపై కూర్చుని పోరాడిన నాయకుడు లోకేష్ అని గుర్తు చేశారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కూడా అడ్డుకున్న సందర్భంలో ఆయన చంద్రబాబును జైలులో కలిసి, బయటకు వచ్చిన తర్వాత పొత్తులపై స్పష్టత ఇచ్చారని తెలిపారు. దాని ఫలితంగానే ప్రజలు అఖండ మెజారిటీతో, అత్యధిక సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని పేర్కొన్నారు. గెలిచిన నాటి నుంచి తండ్రికి చేదోడుగా ఉంటూ రాష్ట్రంలో సక్రమమైన పరిపాలన సాగేందుకు నారా లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వంపై బురదజల్లుతూ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి అభివృద్ధి పనుల ఘనత తనదేనని జగన్ చెప్పుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. తాజాగా మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని జగన్ ప్రకటించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే జగన్‌ను తరిమికొట్టారని, ఇప్పుడు రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి కూడా ఎదురవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల జీవన విధానాలు మారుతున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లి ఎన్నో పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారని చెప్పారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీని వన్‌సైడ్‌గా గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ సేవ చేస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం ప్రజల రక్తాన్ని రోడ్లపై పారిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారని, గొడ్డళ్లతో కేకులు కట్ చేస్తూ బ్యానర్లు పెడుతున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధి లోని వివిధ హోదాలలోని ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
