భారత్ న్యూస్ విజయవాడ…నెల్లూరు యువతిని, మానవత్వ చిరునామాకు చేర్చిన విజయవాడ ఆటో అన్నల కథ!

Ammiraju Udaya Shankar.sharma News Editor…నెల్లూరు జిల్లాకు చెందిన ఓ 19 ఏళ్ల యువతి జీవితం అకస్మాత్తుగా చీకటి మయం అయింది. కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులు దూరమవడంతో, ఆ మానసిక వేదనను భరించలేక, ఏ తోడూ లేని ఒంటరి మనసుతో నెల్లూరు నుంచి బస్సెక్కీ, విజయవాడ బస్టాండ్‌కు చేరుకుంది.
ఆ ఒంటరి ప్రయాణంలో కష్టాలన్నీ ఒకేసారి ముసురుకున్నాయి. దారి మధ్యలో ఫోన్, పర్సు పోగొట్టుకుంది. చేతిలో చిల్లిగవ్వ లేదు, ఆకలితో కడుపు మండుతోంది. ఎటు వెళ్లాలో తెలియక, ఆసరా ఇచ్చేవారు ఎవరూ లేక, ఆ భయంకరమైన నిస్సహాయతతో బస్టాండ్ సమీపంలోని ఆటో డ్రైవర్ల వద్దకు వెళ్లింది.
కళ్లల్లో నీళ్లతో, గుండెలు పిండేసే గొంతుకతో ఆ యువతి పలికిన మాటలు అక్కడి వారి హృదయాన్ని ద్రవించేలా చేసింది: “నాకు ఎవరూ లేరు… కొంచెం టిఫిన్ పెట్టండి… పని చేసుకుంటూ నేనే హాస్టల్‌లో ఉంటాను… దయచేసి నన్ను అక్కడికి చేర్చండి…”
ఆమె దైన్యం చూసిన ఆటో డ్రైవర్లు, ఆమె మాటల్లోని ఆర్తిని, ముఖంలోని బాధను అర్థం చేసుకున్నారు. ముందుగా ఆమెకు ఆకలి తీర్చడానికి టిఫిన్ ఏర్పాటు చేశారు. ఆమె పరిస్థితిని, ఒంటరితనాన్ని గ్రహించిన ఆ పెద్ద మనసున్న మనుషులు తోబుట్టువులా ఆలోచించి, ఆమె సురక్షితంగా ఉండాలన్న లక్ష్యంతో, యువతిని నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఆటో డ్రైవర్లు చెప్పిన విషయం విన్న పోలీసులు వెంటనే స్పందించారు. సీఐ గారికి సమాచారం ఇవ్వగానే, ఆయన తక్షణమే చర్యలు తీసుకున్నారు. ఆ యువతి పూర్తిగా సురక్షితంగా ఉండేలా చూడాలని, వెంటనే వాసవ్య మహిళా మండలికి ఫోన్ చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పోలీసుల సూచనల మేరకు, ఆ యువతి బంధువులు వచ్చి, అప్పగించే వరకు ఆమెను వాసవ్య సంరక్షణలో ఉంచారు, అన్ని విధాలుగా సహాయం అందించే బాధ్యత తీసుకున్నారు.
స్వార్థం నిండిన ఈ సమాజంలో, అన్నల లెక్కన మానవత్వాన్ని చాటిన ఆ ఆటో డ్రైవర్లపై, అలాగే ఆపదలో ఉన్న యువతికి వెంటనే స్పందించి రక్షణ కల్పించిన కృష్ణలంక పోలీసులపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మానవత్వం ఇంకా బతికే ఉంది అని నిరూపించే ఇలాంటి సున్నిత మంచి విషయాలను సోషల్మీడియా ద్వారా తెలియజేస్తే.. మన విజయవాడ మంచితనం గురించి తెలుసుకుంటారు.