రైతు సమస్యలపై కూటమి సర్కార్ మొద్దునిద్ర

భారత్ న్యూస్ కర్నూల్….రైతు సమస్యలపై కూటమి సర్కార్ మొద్దునిద్ర

  • 9న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం
  • పిలుపునిచ్చిన వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేప‌ల్లి వైయ‌స్సార్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై ‘అన్న‌దాత పోరు’ పోస్టర్‌ను ఆవిష్కరించిన పార్టీ రాష్ట్ర సమన్వయకర్త స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

  • కూటమి నేతల కనుసన్నల్లోనే యూరియా బ్లాక్ దందా
  • యూరియా అడిగిన రైతులపై సర్కార్ వేధింపులు
  • రాష్ట్రంలో అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు దూరం
  • అన్నదాత గోడును పట్టించుకోని దుర్మార్గపు ప్రభుత్వం
  • రైతులతో కలిసి ఆందోళనలతో ప్రభుత్వ మెడలు వంచుదాం
  • రైతులకు న్యాయం జరిగే వరకు పోరు
    : వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి డిమాండ్

తాడేప‌ల్లి:

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ రైతు సమస్యలపై మొద్దునిద్ర పోతోందని, అన్నదాతల పట్ల నిర్లక్ష్యంతో ఉన్న ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకే ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ ఆందోళనలు చేపట్టనుందని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మేరకు శనివారం పార్టీ నాయకులతో కలిసి ‘అన్నదాత పోరు’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు కనీసం అవసరమైన మేరకు యూరియాను కూడా అందించలేని ఒక అసమర్థ పాలనను చూస్తున్నామని మండిపడ్డారు. కృత్రిమ కొరతను సృష్టించి, యూరియా బ్లాక్‌ మార్కెట్ దందాతో కూటమి నేతలు రూ.కోట్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గమైన ఈ ప్రభుత్వం మెడలు వంచి, రైతులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే…

రైతు స‌మ‌స్య‌ల విష‌యంలో మొద్దు నిద్ర‌పోతున్న ప్ర‌భుత్వాన్ని మేల్కొల్ప‌డం కోసం వైయ‌స్సార్సీపీ ఆధ్వ‌ర్యంలో ఈనెల 9వ తారీఖున పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ గారి ఆదేశాల మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్డీవో కేంద్రాల వద్ద శాంతియుతంగా నిర‌స‌న తెలియ‌జేసిన అనంత‌రం ఆర్డీవోల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేయ‌డం జ‌రుగుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో వైయ‌స్సార్సీపీ నాయ‌కులు, రైతుసంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. దీనికి సంబంధించిన ‘అన్న‌దాత పోరు’ పోస్టర్ ను ఆవిష్కరించడం ద్వారా దీనిని ప్రజల్లోకి తీసుకువెళుతున్నాం. ఈ రోజే అన్ని జిల్లా కేంద్రాల్లో ఇదే పోస్ట‌ర్ లాంచ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. రేపు నియోజ‌కవ‌ర్గ కేంద్రాల్లో, మ‌ర్నాడు అన్ని మండ‌ల కేంద్రాల్లో పోస్ట‌ర్ ఆవిష్క‌రించ‌డం జ‌రుగుతుంది. రైతులు, వ్యవసాయ సంఘాలతో కలసి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నిరసన గళాన్ని వినిపిస్తాం. తక్షణం ప్రభుత్వం స్పందించి రైతాంగ డిమాండ్‌లపై దిగిరావాలి. యూరియా బ్లాక్ మార్కెటింగ్‌ని అరికట్టి ఎమ్మార్పీ ధ‌ర‌ల‌కే రైతులంద‌రికీ స‌క్ర‌మంగా పంపిణీ చేయాలి. ఇన్‌పుట్ స‌బ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలి. ట‌మాట‌, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర చెల్లించాలి. గ‌త వైయ‌స్సార్సీపీ హ‌యాంలో మాదిరిగా ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధిని ఏర్పాటు చేసి మార్కెట్‌లో పోటీ పెంచాలి. ప్రైవేటు వ్యాపారుల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేసి మ‌ద్ద‌తు ధ‌ర‌కు ఒప్పించి రైతుల‌కు అండ‌గా నిల‌బ‌డాలి. లేని పక్షంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయ‌స్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తాం.

  • వైయస్ జగన్ హయాంలో రైతే-రాజు

వైయ‌స్ జ‌గ‌న్ గారి నాయ‌క‌త్వంలో గత అయిదేళ్ళ పాలనలో రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగంలో ఎన్నో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఆయ‌న పాల‌న‌లో స్వాతంత్ర్యం వ‌చ్చిన తర్వాత దేశంలో ఎప్పుడూ లేనివిధంగా వ్య‌వ‌సాయం రంగంలో వినూత్న‌ మార్పులు చోటు చేసుకున్నాయి. విత్త‌నం నుంచి విక్ర‌యం వ‌ర‌కు అడుగ‌డుగునా రైతన్న‌ను చేయి ప‌ట్టి న‌డిపించారు. వ్య‌వ‌సాయాధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీలో 20 ఏళ్ల‌లో జ‌ర‌గ‌ని అభివృద్ధిని ఐదేళ్ల‌లోనే చేసి చూపించారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన 15 నెల‌ల్లోనే ఐదేళ్ల‌లో నిర్మించిన వ్య‌వ‌స్థ‌ల‌ను, తీసుకొచ్చిన మార్పుల‌ను స‌మూలంగా నాశ‌నం చేశారు. ఏ రంగం చూసినా అరాచ‌కం త‌ప్ప అభివృద్ధి శూన్యం అనేది క‌నిపిస్తోంది. ప్ర‌శాంతంగా న‌డుస్తున్న వ్య‌వ‌స్థ‌ల్లో కూడా సంక్షోభం సృష్టించి దోచుకుంటున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. రాష్ట్రంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా యూరియా కొర‌తను సృష్టించి రైతు సంక్షేమాన్ని ప‌ణంగా పెట్టి మ‌రీ దోచుకుతింటున్నారు. అతివృష్టి, అనావృష్టితో ఇబ్బంది పడిన సంద‌ర్భాల్లో రైతుల‌ను ఆదుకునే విధంగా గ‌త వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వంలో పంట న‌ష్టప‌రిహారం అంద‌జేస్తే నేడు కూట‌మి పాల‌న‌లో దాని ఊసే లేదు. ఏ డిపో ద‌గ్గ‌ర చూసినా కిలోమీట‌ర్ల దూరం యూరియా కోసం రైతులు నిల‌బ‌డిన క్యూలైన్లు క‌ళ్ల‌ముందే క‌నిపిస్తున్నా సీఎం చంద్ర‌బాబు మాత్రం ఎరువుల కోర‌త లేద‌ని ఎలా చెప్పుకుంటున్నారో తెలియ‌డం లేదు. 2014-19 మ‌ధ్య టీడీపీ హ‌యాంలో ఉన్న దారుణ‌మైన ప‌రిస్ధితులను 15 నెల‌ల్లోనే తీసుకొచ్చారు. ఎరువులను అక్ర‌మంగా నిల్వ‌చేసి కృత్రిమ కొర‌త సృష్టిస్తున్నారు. రైతులే రోడ్డెక్కి ప్ర‌శ్నిస్తుంటే వారికి వైయ‌స్సార్సీపీ ముద్ర వేయ‌డం, బొక్క‌లో వేస్తామ‌ని రైతుల్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు బెదిరిస్తున్నారు.

  • చంద్రబాబు పాలనలో రైతుకు నిత్యం కష్టాలే

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక రాష్ట్రంలో రైతుల ప‌రిస్ధితి ద‌యనీయంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొర‌త ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో పంట న‌ష్ట ప‌రిహారం ఇవ్వ‌డం లేదు. వ‌రి, పొగాకు, ఉల్లి, చీనీ, మామిడి, అర‌టి.. ఇలా రాష్ట్ర‌మంత‌టా రైతులు పండించిన పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఉండ‌టం లేదు. వైయ‌స్సార్సీపీ దీనిపై నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసి ప్ర‌శ్నించిన‌ప్పుడు మాత్రం హ‌డావుడిగా కేంద్రానికి లేఖ రాసేసి చేతులు దులిపేసుకుంటున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఏడాదిన్న‌ర పాల‌న‌లో ఏనాడూ రైతుల‌ను ఆదుకునే చిన్న ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. వ్య‌వ‌సాయాన్ని గాలికొదిలేసిందే కాకుండా యూరియా ఎక్కువ వాడితే కేన్స‌ర్ వస్తుంద‌ని ముఖ్య‌మంత్రి ఉచిత స‌ల‌హాలిస్తున్నాడు. యూరియా కొర‌త గురించి ప్ర‌శ్నిస్తేనే ఆయ‌న ఇలాంటివ‌న్నీ చెబుతుంటారు. ఇన్ని విష‌యాలు తెలిసిన వ్య‌క్తి ఇవ‌న్నీ త‌న పాల‌సీలో ఎందుకు ప్ర‌క‌టించ‌లేదు? బాధ్య‌త‌గా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్న ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్సీపీని ఫేక్ పార్టీ అని, తొక్కి ప‌డేస్తా అని బెదిరిస్తున్నాడు. చ‌రిత్ర‌లో నియంత‌లు కూడా ప్ర‌జా స‌మ‌స్య‌ల విష‌యంలో ఇంత దారుణంగా వ్య‌వ‌హరించి ఉండ‌రు. ప్ర‌జ‌ల నుంచి నేరుగా అధికారం తెచ్చుకుని ఉంటే ఆయ‌న‌కివ‌న్నీ తెలుస్తాయి. ఎప్పుడూ ఏదో ఒక పార్టీ మీద ఆధార‌ప‌డి, లేదా వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వ‌స్తున్నాడు కాబ‌ట్టే ప్ర‌జా స‌మస్య‌ల ప‌ట్ల చిత్త‌శుద్ధి, బాధ్య‌త చంద్ర‌బాబుకి లేదు. కాబ‌ట్టే ఆయ‌న‌కు ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌ట్ల చిత్తశుద్ధి, బాధ్య‌త‌, ప్రజాస్వామ్యం అంటే గౌర‌వం లేదు.

పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లా, మొండితోక అరుణ్ కుమార్‌, మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసులు, మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కన‌క‌రావు, మంగ‌ళ‌గిరి నియోజ‌కవ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ దొంతిరెడ్డి వేమారెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైయస్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, ఇతర వైయస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు