భారత్ న్యూస్ రాజమండ్రి…పంటల నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలని ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు

Ammiraju Udaya Shankar.sharma News Editor…వ్యవసాయ, హార్టికల్చర్ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
అమరావతి :
ఒడిశా రాష్ట్రంలోని గోపాల్‌పూర్ సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం వ్యవసాయ, హార్టికల్చర్ ఉన్నతాధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినే అవకాశం ఉందని, వ్యవసాయ మరియు హార్టికల్చర్ అధికారులు తక్షణమే ఫీల్డ్‌లోకి దిగి పంటల నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలని ఆదేశించారు. అవసరమైతే ఇతర జిల్లాల సిబ్బందిని కూడా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు తరలించి పంటల అంచనాలు వేయడంలో, రైతులకు సహాయం చేయడంలో వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. వాయుగుండం ప్రభావం తగ్గిన తరువాత ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలపై స్పష్టమైన సూచనలు అందించాలంటూ వ్యవసాయ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెవెన్యూ, విద్యుత్, పోలీస్, ఇరిగేషన్ శాఖలతో సమన్వయంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతులు నష్టపోకుండా ప్రతి ఒక్క అధికారి కట్టుదిట్టమైన పర్యవేక్షణతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం రైతుల పక్కన నిలబడి ఉంది. వాయుగుండం, వర్షాల ప్రభావం ఎంతటి సవాళ్లను విసిరినా, అధికారులు క్షేత్రస్థాయిలో జాగ్రత్తలు తీసుకుని రైతులకు అండగా నిలవాలని మంత్రి పేర్కొన్నారు.
భారీ వర్షాలు – వరద పరిస్థితులపై ఆరా
ఒడిసా, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి, వంశధార నదులు ఉప్పొంగుతున్న నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఫోన్ ద్వారా ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మంత్రి అచ్చెన్న అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూములు 24/7 ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద సహాయక చర్యల్లో NDRF, SDRF, పోలీసు, ఫైర్ సిబ్బంది సమర్థంగా, వేగంగా స్పందించాలని మంత్రి స్పష్టం చేశారు. వంశధార, నాగావళి నదుల తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని అధికారులను ఆదేశించారు. టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 ద్వారా సమాచారం పొందవచ్చని మంత్రి తెలిపారు.
