భారత్ న్యూస్ రాజమండ్రి….ఇంటర్మీడియట్ విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. పలు పోస్టులకు పదోన్నతుల విషయంలో ముడుపులు డిమాండ్ చేశారనే అంశం ఏసీబీ విచారణకు దారితీసింది. తాజాగా కమిషనరేట్‌లోని ఓ సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. ఇంటర్ విద్యాశాఖలో ఇటీవల పలువురికి పదోన్నతులు ఇచ్చారు. దీనికోసం ఓ సూపరింటెండెంట్ స్థాయి అధికారి నగదు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. బోధనేతర ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ దివ్యాంగ ఉద్యోగి లైబ్రేరియన్ నుంచి సదరు సూపరింటిండెంట్ రూ.లక్ష డిమాండ్ చేశారని తెలిసింది. దీనిలో భాగంగా తొలుత రూ.15 వేలు గూగుల్ పే ద్వారా తన ఖాతాలో వేయించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయినా పదోన్నతి రాకపోవడంతో ఆ ఉద్యోగి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆ ఉద్యోగి తన సమస్యతోపాటు ఇతరుల ముడుపుల విషయాన్ని కూడా ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోమ, మంగళవారాల్లో సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు విచారణకు పిలిచారు. కొన్ని లావాదేవీలపై ఆయన గుర్తులేదని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ఏసీబీ ఆరా తీసింది. కాగా, ఆ అధికారిపై ఇద్దరు మంత్రులు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
