పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి

భారత్ న్యూస్ ఢిల్లీ…..పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి

ప్రధాని మోడీకి 16 ప్రతిపక్ష పార్టీల నేతలు లేఖ

ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత జరిగిన పరిణామాలను చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 16 ప్రతిపక్ష పార్టీల నేతలు సంయుక్తంగా లేఖ రాశారు. ”మా సమిష్టి, అత్యవసర అభ్యర్థనను ఇండియా బ్లాక్‌ నాయకులమైన మేము పునరుద్ఘాటిస్తున్నాం.

ఉగ్రవాద దాడి, పూంచ్‌, ఉరి, రాజౌరిలలో పౌరుల హత్య, కాల్పుల విరమణ ప్రకటనలు, జాతీయ భద్రత, విదేశాంగ విధానంపై దాని ప్రభావాల గురించి దేశం ఎదుర్కొంటున్న పరిస్థితిపై తీవ్ర ప్రశ్నలు ఉన్నాయి. భారతదేశ వైఖరిపై అంతర్జాతీయ సమాజంతో చర్చించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇచ్చాం. ప్రభుత్వం పార్లమెంటుకు కాకుండా విదేశాలకు, మీడియాకు వివ రించింది.

దేశ ప్రజలను, వారు ఎన్నుకున్న ప్రతినిధులను చీకటిలో ఉంచింది. అందువల్ల, అఖిలపక్ష నాయకులు తిరిగి వచ్చిన వెంటనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మీరు త్వరగా, సానుకూలంగా స్పందిస్తారని విశ్వసిస్తున్నాం” అని లేఖలో పేర్కొన్నారు.

ఈ లేఖలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కె.సి వేణుగోపాల్‌ (కాంగ్రెస్‌), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ), అభిషేక్‌ బెనర్జీ (టీఎంసీ), టిఆర్‌ బాలు (డీఎంకే), కె. రాధాకృష్ణన్‌ (సీపీఐ(ఎం)), అరవింద్‌ గణపతి సావంత్‌ (శివసేన-ఠాక్రే), అభరు కుమార్‌ సిన్హా (ఆర్జేడీ), మియాన్‌ అల్తాఫ్‌ అహ్మద్‌ (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), ఈటి మహమ్మద్‌ బషీర్‌ (ఐయూఎంఎల్‌), కె.సుబ్బరాయన్‌ (సీపీఐ), ఎన్‌.కె ప్రేమచంద్రన్‌ (ఆర్‌ఎస్పీ), జోబా మాఝీ, విజరు కుమార్‌ హన్స్‌దక్‌ (జెఎంఎం), తిరుమావళవన్‌ (వీసీకే), కె. ఫ్రాన్సిస్‌ జార్జ్‌ (కేరళ కాంగ్రెస్‌), దురై వైకో (ఎండిఎంకె), రాజారామ్‌ సింగ్‌ (సీపీఐ(ఎంఎల్‌)ఎల్‌) సంతకాలు చేశారు.

అంతకుముందు ఢిల్లీలో ఇండియా బ్లాక్‌ పార్టీలు సమావేశం అయ్యాయి. కాంగ్రెస్‌, టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ(ఎం), ఐయూఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌, ఎండీఎంకే, సీపీఐ, సీపీఐఎంఎల్‌, వీసీకే, జెఎంఎం, ఎన్‌సి, ఆర్‌ఎస్పీ, శివసేన (యూబీటీి) సహా అనేక పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కాన్స్టిట్యూషన్‌ క్లబ్‌లో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు జైరామ్‌ రమేష్‌, దీపేంద్ర హుడా, టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌, ఎస్పీ నేత రాంగోపాల్‌ యాదవ్‌, ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌ ఝా, శివసేన (యూబీటీ) ఎంపీి సంజరు రౌత్‌ మాట్లాడారు.

ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసినట్టు ప్రతిపక్ష నాయకులు తెలిపారు. కాంగ్రెస్‌ నాయకుడు జైరామ్‌ రమేష్‌ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రవాద దాడి తరువాత ప్రతిపక్షాలు దేశ సాయుధ దళాలకు మద్దతు ఇచ్చాయని అన్నారు. ”అమెరికా కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే, మేము ప్రత్యేక సమావేశాన్ని డిమాండ్‌ చేశాం.

సాయుధ దళాలకు ధన్యవాదాలు తెలియజేయాలని అనుకుంటున్నాం. ఆపరేషన్‌ సిందూర్‌, అమెరికా కాల్పుల విరమణ ప్రకటించిన అన్ని అంశాలకు, పాకిస్తాన్‌ను ఒంటరి చేయడానికి మేము తీసుకున్న చర్యలు, దేశ ప్రయోజనాలలో మేము ఎంత విజయవంతమయ్యామనే దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నాం” అని అన్నారు. మేము (ప్రతిపక్షం) కూడా అదే కారణంతో డిమాండ్‌ చేశామని ఆయన తెలిపారు.

”అనేక పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను ఇతర దేశాల ముందు ఉంచు తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా అదే అభిప్రాయాన్ని పార్లమెంటుతో పంచుకోవాలని కోరుకుంటు న్నాము” అని హుడా అన్నారు. ”రాహుల్‌ గాంధీ, వివిధ పార్టీల ఇతర ఎంపీలు కూడా ఇదే డిమాండ్‌ చేశారు” అని పేర్కొన్నారు.
టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓ బ్రెయిన్‌ మాట్లాడుతూ ”పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని కోరుతూ 16 పార్టీలు ప్రధాని మోడీకి లేఖ రాశాయి. ప్రభుత్వం పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది.

పార్లమెంటు ప్రజలకు బాధ్యత వహిస్తుంది” అని అన్నారు. ఎస్పీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ ”ఇతర దేశాలకు తెలియజేస్తున్నట్లే ఆపరేషన్‌ సిందూర్‌ గురించి పార్లమెంటుకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం” అని అన్నారు. ”దేశానికి మద్దతుగా ఏ దేశాలు రాలేదు.

మనం దౌత్యపరంగా విఫలమయ్యాం. సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపు తున్నాము. కానీ ప్రధానమంత్రి మోడీ అనేక దేశాలకు వెళ్లినా, ఆయన స్నేహితుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా కాల్పుల విరమణకు ఘనత వహించాడు. దౌత్యపరంగా విఫలమయ్యాం. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అవసరం” అని ఆయన అన్నారు.