పులిగడ్డ సర్కిల్ వద్ద “మృత్యు సాక్షి”ఆ ధ్వంసమైన కారు మీకేం చెబుతోంది?

భారత్ న్యూస్ రాజమండ్రి…పులిగడ్డ సర్కిల్ వద్ద “మృత్యు సాక్షి”

–ఆ ధ్వంసమైన కారు మీకేం చెబుతోంది?

అవనిగడ్డ : ముల్లును ముల్లుతోనే తీయాలంటారు పెద్దలు.. అలాగే అవనిగడ్డ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ ఆదేశాల మేరకు, అవనిగడ్డ డిఎస్పీ టి.విద్యాశ్రీ నేతృత్వంలో, అవనిగడ్డ సిఐ జి. యువకుమార్ మరియు ఎస్ ఐ కె.శ్రీనివాస్ ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

మాటలతో చెప్పే హెచ్చరికల కంటే, కళ్లకు కనిపించే దృశ్యం ప్రాణాల విలువను చాటి చెబుతుందని నమ్మిన పోలీసులు, పులిగడ్డ సర్కిల్ వద్ద గతంలో ప్రమాదానికి గురైన ఒక కారును “డెమో”గా ప్రదర్శిస్తున్నారు.

పులిగడ్డ సర్కిల్ అంటేనే ప్రమాదాలకు నిలయంగా మారిందన్న చేదు నిజం మనందరికీ తెలిసిందే. గతంలో ఇక్కడ ఎన్నో ఘోర ప్రమాదాలు జరిగాయి, మరెన్నో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎందరో తల్లుల కడుపుకోతకు, మరెన్నో కుటుంబాల విషాదానికి ఈ ప్రాంతం సాక్షిగా నిలిచింది. సరిగ్గా అదే ప్రాంతంలో ఇప్పుడు పూర్తిగా ధ్వంసమై, ఇనుప తుక్కులా మారిన ఈ కారు అస్థిపంజరాన్ని చూడగానే ప్రతి వాహనదారుడిలోనూ ఒక్కసారిగా వణుకు పుడుతోంది.

ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి ఈ ప్రమాద తీవ్రత స్పష్టంగా కనిపించేలా, ఆ ధ్వంసమైన కారుపై పోలీసులు రేడియం స్టిక్కర్లు అంటించారు. చీకట్లో వాహనాల లైట్లు పడగానే ఈ రేడియం స్టిక్కర్లు మెరుస్తూ, అతివేగం ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో నిశ్శబ్దంగా హెచ్చరిస్తున్నాయి. ఆ వాహన స్థితిని చూస్తుంటే, ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఉన్న ప్రాణాలు ఏమయ్యుంటాయో అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ మెదులుతోంది.

పులిగడ్డ సర్కిల్ మీదుగా వెళ్లే ప్రతి వాహనదారుడికి ఈ కారు ఒక మేల్కొలుపులా కనిపిస్తోంది. వేగం ఇచ్చే క్షణికానందం కంటే, మీ కోసం ఇంట్లో ఎదురుచూసే కుటుంబ సభ్యుల చిరునవ్వే ముఖ్యం అని ఈ వాహన శిథిలాలు గుర్తుచేస్తున్నాయి.

పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ మెరిసే కారు శిథిలాల వైపు ఒక్కసారి చూడండి.. అది మీ ప్రాణానికి ఇచ్చే విలువైన సలహా అని గ్రహించండి.