నమ్మకంతో కూడిన రవాణా సేవలు సంస్థకు ఎంతో ముఖ్యం.తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ:

భారత్ న్యూస్ డిజిటల్ హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ:

“నమ్మకంతో కూడిన రవాణా సేవలు సంస్థకు ఎంతో ముఖ్యం

భద్రత.. ఆర్టీసీకి జీవనాడి

బస్ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలో వీసీ అండ్ ఎండీ

హైదరాబాద్లోని బస్ భవన్లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ శ్రీ నాగిరెడ్డి గారు జాతీయ జెండాను ఎగురవేశారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి మహనీయుల చిత్రపటాలకు పుష్ఫాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సంస్థ అధికారులు, సిబ్బందితో పాటు ప్రజా రవాణా వ్యవస్థను ఆదరిస్తోన్న ప్రయాణికులకు 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంస్థ సిబ్బంది కర్తవ్యం, రవాణా సేవలపై ప్రసంగిస్తూ ఆయన మాటల్లోనే…

‘’ఈ రోజు మనం జెండా ఎగురవేస్తున్నాం అంటే, అది కేవలం ఒక ఆనవాయితీగా నిర్వహించుకొనే కార్యక్రమం ఎంత మాత్రం కాదు. ఇది ఎంతో పవిత్రంగా నిర్వహించుకోవలసిన జాతీయ పండుగ. భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులకే కాదు — మన మీద పెట్టిన బాధ్యతలకూ గుర్తు.

ప్రజలకు సేవ చేయడం..ప్రాణాల భద్రత కాపాడడం..ఇవే మన ఆర్టీసీ ఉద్యోగుల అసలు గుర్తింపు. టీజీఎస్ ఆర్టీసీ కేవలం ఒక ప్రజా రవాణా సంస్థ మాత్రమే కాదు. ఇది తెలంగాణ ప్రజల నమ్మకం.ప్రతిరోజూ ఎన్నోలక్షల మంది ప్రజలను గ్రామాల నుంచి పట్టణాలకు, పిల్లల్ని బడికి,ఉద్యోగులను పనికి, రోగుల్ని ఆసుపత్రికి చేరవేసేది మన బస్సులే. ఎండైనా, వానైనా, పండుగైనా — “ఆర్టీసీ నడవాలే” అన్న నమ్మకంతో మీరు స్టీరింగ్ పట్టుకుంటున్నారు. ఆ సేవకు నేను తలవంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజు నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి.భద్రత అనేది ఆర్టీసీ జీవనాడి.

ఒక చిన్న నిర్లక్ష్యం… ఒక తొందరపాటు నిర్ణయం… ఒక నిబంధన ఉల్లంఘన… మనిషి ప్రాణానికే ప్రమాదం. మన చేతుల్లో ఉన్నది స్టీరింగ్ మాత్రమే కాదు, వందలాది కుటుంబాల నమ్మకం.అందుకే నేను స్పష్టంగా చెబుతున్నాను.

స్పీడ్ కాదు…సేఫ్టీ ముఖ్యం. తొందర కాదు నిబంధన ముఖ్యం. అలవాటు కాదు.. బాధ్యత ముఖ్యం. భద్రత తర్వాత మన రెండో పెద్ద బాధ్యత, సర్వీస్ క్వాలిటీ. ప్రయాణికుడు మన నుంచి కోరేది, కేవలం రవాణా సర్వీస్ మాత్రమే కాదు. గౌరవం కూడా ఆశిస్తాడు. బస్సు శుభ్రంగా ఉండాలి. సమయానికి బయలుదేరాలి. మాట తీరులో మర్యాద ఉండాలి. ఏ సమస్య వచ్చినా సహనంగా స్పందించాలి.

“ఆర్టీసీ అంటే సర్కారు బస్సు” కాదు “ఆర్టీసీ అంటే నమ్మకం” అన్న పేరు రావాలి. మన సంస్థలో ప్రతి ఉద్యోగి తన పని చిన్నదని అనుకోవద్దు. స్టీరింగ్ పట్టినా, స్పానర్ పట్టినా, ఫైల్ పట్టినా, మనమందరం ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం.

ఈ గణతంత్ర దినోత్సవ రోజు మనమందరం ఒక మాట చెప్పుకుందాం…ప్రతి ప్రయాణికుడు మన కుటుంబ సభ్యుడే, ప్రతి ట్రిప్ ఒక బాధ్యత. ప్రతి రోజు జీరో యాక్సిడెంట్ లక్ష్యం. జెండా రంగులు మనకు గుర్తు చేస్తున్నాయి. త్యాగం లేకుండా స్వేచ్ఛ రాలేదు, బాధ్యత లేకుండా అభివృద్ధి రాదు. మన గతంపై గర్వపడుదాం. మన పనిలో క్రమశిక్షణ పెంచుకుందాం.మన సంస్థను ఆర్థికంగా పరిపుష్టం చేసుకుందాం.

టీజీఎస్ ఆర్టీసీని దేశానికి ఆదర్శమైన సురక్షిత ప్రజారవాణా సంస్థగా నిలబెడదాం. ఉద్యోగులందరి సంక్షేమం, సంతృప్తి, ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడం..ఈ రెండింటి కోసం నేను నా శాయశక్తులా కృషి చేస్తాను’’ అని తెలియజేశారు.

ఈ వేడుకలో ఈడీలు మునిశేఖర్ గారు, వెంకన్న గారు, సీటీఎంలు శ్రీధర్ గారు, శ్రీదేవి గారు, సీపీఎం ఉషాదేవి గారు, జాయింట్ డైరెక్టర్ (వి అండ్ ఎస్) నర్మద గారు, తదితరులు పాల్గొన్నారు.