పోలీసుల ఆరోగ్య భద్రతకు ‘హెల్త్ ప్రొఫైల్’

భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్:

పోలీసుల ఆరోగ్య భద్రతకు ‘హెల్త్ ప్రొఫైల్’

వైద్య పరీక్షల రిపోర్టుల ఆధారంగా కేటగిరీలుగా విభజన

గణతంత్ర వేడుకల్లో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ వెల్లడి

నాంపల్లి అగ్నిప్రమాదంలో సాహసోపేత సేవలు చేసిన వారికి అభినందనలు

పోలీసు సిబ్బంది సంక్షేమం, ఆరోగ్య భద్రతే లక్ష్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రత్యేకంగా వారి ‘హెల్త్ ప్రొఫైల్స్’ సిద్ధం చేయనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ వెల్లడించారు వైద్య పరీక్షల రిపోర్టుల ఆధారంగా వారిని ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలుగా విభజించి, వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు, చికిత్స అందేలా చూస్తామని ఆయన తెలిపారు. 
 
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం పేట్ల బురుజులోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన వేడుకల్లో హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. నగరవాసులకు, పోలీస్ సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పలు కీలక నిర్ణయాలను, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి, మన దేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని అన్నారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులకు భంగం కలగకుండా రక్షణ కల్పించడమే పోలీస్ వ్యవస్థ ప్రథమ కర్తవ్యమని గుర్తుచేశారు. 

నగరంలో ఏ పండుగ వచ్చినా, ఏ బందోబస్తు ఉన్నా పోలీస్ సిబ్బంది తమ కుటుంబాలను వదిలి అత్యంత నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చూపిస్తోన్న చొరవ అభినందనీయమని అన్నారు. 

సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు హెచ్-న్యూ విభాగాన్ని బలోపేతం చేస్తున్నామని, యువత వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సీపీ కోరారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఆహార కల్తీపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

హైదరాబాద్ మతసామరస్యానికి ప్రతీక అని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని సీపీ అన్నారు. సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100కు తెలియజేయాలని కోరారు. 

ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని,  స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. మీ ఆరోగ్యం పట్ల, కుటుంబం పట్ల కూడా శ్రద్ధ వహించాలని చెప్పారు. 

ఇటీవల నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని  హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్  తెలియజేశారు. ఈ ప్రమాద సమయంలో ప్రాణాలకు తెగించి సాహసోపేత సేవలు చేసిన దినేష్, మహమాద్ జకీర్, కలీం, రహీం, అమర్ తో పాటు చొరవ చూపిన కార్పొరేటర్లు సురేఖ ఓం ప్రకాశ్, జఫర్ ఖాన్ కు అభినందనలు తెలిపారు.

అప్జల్ గంజ్ కు చెందిన దినేష్ ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించారు. ఆపద సమయంలో మతసామరస్యం వెల్లువిరిసిందని.. కష్టం వస్తే ‘మేమంతా ఒక్కటే’ అని నిరూపించి, హైదరాబాద్ గంగా-జమునా తహజీబ్ సంస్కృతిని మరోసారి చాటిచెప్పారని కొనియాడారు. అలాగే, విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. 

ఈ కార్యక్రమంలో అదనపు సీపీ( క్రైమ్స్) శ్రీ శ్రీనివాసులు, ఐపీఎస్, అదనపు సీపీ(సౌత్ రేంజ్) శ్రీ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీ(ట్రాఫిక్) శ్రీ జోయల్ డేవిస్, ఐపీఎస్, జాయింట్ సీపీ(నార్త్ రేజ్) శ్రీమతి శ్వేత, ఐపీఎస్, డీసీపీ (సీఏఆర్ హెడ్ క్వార్టర్స్) వెంకటేశ్వర్లు, ఐపీఎస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.