రౌడీ షీటర్ ను కమిషనరేట్ పరిధి నుండి బహిష్కరించిన సిపి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.రౌడీ షీటర్ ను కమిషనరేట్ పరిధి నుండి బహిష్కరించిన సిపి

వరంగల్ పోలీస్ కమిషనరేట్
శాంతి భద్రతల పరిరక్షణ పరిరక్షణలో మీల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ వంచనగిరి సురేష్ @ కోతి సురేష్ ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుండి బహిష్కరణ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
తొలిసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా శాంతి, భద్రతలకు భంగం కలిగిస్తున్న రౌడీషీటర్ వంచనగిరి సురేష్ @ కోతి సురేష్ (వయస్సు 31 సంవత్సరాలు) పై హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం, 1348 ఫస్లి (వరంగల్ మెట్రోపాలిటన్ ఏరియా పోలీస్ చట్టం, 2015) లోని సెక్షన్ 26(1) ప్రకారం ఆరు నెలలు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ ఉత్తర్వుల జారీ అనంతరం మీల్స్ కాలని ఇన్స్ స్పెక్టర్ రమేష్, ఎస్. ఐ మిథున్ నిందితుడు కోతి సురేష్ ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులో సీపీ జారీచేసిన ఉత్తర్వులను అందజేశారు.
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు చెందిన వంచనగిరి సురేష్ రౌడీషీటర్‌గా గుర్తించబడిన వ్యక్తి కాగా, అతనిపై గతంలో పలు తీవ్రమైన నేర కేసులు నమోదై ఉన్నాయి. ఆయా కేసులు ప్రజలలో భయాందోళనలను సృష్టిస్తూ, శాంతియుత జీవన విధానానికి ఆటంకం కలిగించినట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇతని అక్రమ కార్యకలాపాల కారణంగా ప్రజలు ఫిర్యాదులు చేయడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో, అతనికి కారణాలు చూపించాలని నోటీసు జారీ చేయగా, సంబంధిత అధికారుల ఎదుట హాజరుకాలేదు. ఎలాంటి వ్రాతపూర్వక వివరణ ఇవ్వకపోవడంతో, అతని వైఖరి ప్రజా శాంతికి ముప్పుగా మారిందని నిర్ధారణకు వచ్చారు.
అందువల్ల, ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని, వంచనగిరి సురేష్‌ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి ఆరు (6) నెలల కాలానికి వెంటనే బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. కోర్టు హాజరు కోసం మాత్రమే ముందస్తు అనుమతితో కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వబడుతుంది.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు భయభ్రాంతులకు లోనుకాకుండా నేరాలపై సమాచారం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

—వరంగల్ పోలీస్ కమిషనరేట్