భారత్ న్యూస్ విజయవాడ…అమరావతికి ప్రత్యేక చట్టాలు
మెట్రోపాలిటన్ సిటీగా అమరావతి
స్వయం ప్రతిపత్తి కల్పించే ఆలోచన
నిబంధనల రూపకల్పనపై కసరత్తు
పన్నులు, భూ అమ్మకాలపైనా సొంత నిర్ణయం
యూజర్ ఛార్జిల వసూలుకు అవకాశం

Ammiraju Udaya Shankar.sharma News Editor…రాజధాని అమరావతి నగరం పిపిపి దిశగా అడుగులు వేస్తోంది. స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా నిబంధనలు రూపొందిస్తున్నారు. పరిపాలనకు వీలుగా రూపొందించే నిబంధనలు ప్రపంచబ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు నియమించిన సంస్థలు లేదా వ్యక్తుల అనుమతి, పర్యవేక్షణ తప్పనిసరి చేశారు. మరో నెలరోజుల్లో విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది. రాజధాని ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భూములు అమ్ముకోవడానికి (మానిటైజ్) హక్కుల కల్పించే విధంగా మున్సిపల్ చట్టాల్లో మార్పులు చేయనున్నారు. తొలిసారి ప్రపంచబ్యాంకు కనుసన్నల్లో తయారవుతున్న చట్టాలుగా అమరావతి క్యాపిటల్‌సిటీ పరిపాలన నిబంధనలు నిలవనున్నాయి. ముఖ్యంగా రాజధాని ఆర్థిక వనరులను అంచనా వేసి స్థిరమైన రాబడి, పిపిపి, ప్రైవేటు పెట్టుబడికి అవసరమైన విధంగా చట్టపరమైన ఫ్రేమ్‌వర్కును రూపొందించనున్నారు. దీనికోసం ప్రస్తుతం ఉన్న ఎపిసిఆర్‌డిఎ చట్టాలను పరిశీలించి 74వ రాజ్యాంగ సవరణకు లోబడి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు అవసరమైన అన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. నిబంధనల రూపకల్పన కోసం ఢిల్లీ, ఛండీగడ్, నయా రాయపూర్, డొలేరా కార్పొరేషన్లు, పరిపాలన సంస్థలతోపాటు అంతర్జాతీయంగా సింగపూర్, బ్రెసీలియా, పుత్రజయ, సెజోంగ్, నసుంతారా, జోహోన్స్‌బర్గ్, ఆస్తానా నగరాల్లో పాలనా నిబంధనలు పరిశీలించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మున్సిపల్, కార్పొరేషన్ చట్టాలకు మించి ప్రత్యేక చట్టాలు రూపొందించనున్నారు. పరిపాలన కోసం అత్యున్నత మండలిని ఏర్పాటు చేయడం, రవాణా, విపత్తు నిర్వహణ వంటి అంశాల కోసం ప్రత్యేక ఏజెన్సీలనూ నియమించేందుకు వీలుగా చట్టాలను రూపొందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సిఆర్‌డిఎ చట్టం నుండి పరిపాలనా కేంద్రంగా మార్చేందుకు దశలవారీ ప్లాను రూపొందించనున్నారు. దీనికోసం రాజధానిలో కనీసం మూడు వర్కుషాపులు నిర్వహించి అభిప్రాయాలూ తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాజధాని నగరం నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా రూపొందించే నిబంధనలు దశలవారీ జరిగే అభివృద్ధి, జనాభాకు వీలుగా మార్చుకునేలా ప్రతిపాదనలు చేయాలని అనుకున్నట్లు తెలిసింది. 2025 జులైలో ప్రపంచబ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు ఆధ్వర్యంలో ఇన్నోవేటివ్ అర్బన్ గవర్నెన్స్ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో అమరావతికి ప్రత్యేక చట్టం కావాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ సెమినార్లో ప్రభుత్వం నుండి అమరావతికి ఆర్థిక మద్దతు ఇవ్వడం, స్వయం ప్రతిపత్తి కల్పించడం, భూములను ఆర్థిక వనరులుగా మార్చుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. వీటిల్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, రాజధాని అమరావతి మధ్య ఆర్థిక పంపిణీ జరిగేలా చట్టాన్ని రూపొందించనున్నారు.
