భారత్ న్యూస్ డిజిటల్ :
నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో వెలసిన చారిత్రక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానములో భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు (మంగళవారం) శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. నెల రోజుల పాటు సాగిన ధనుర్మాస ఉత్సవాలు ఈరోజుతో సంపూర్ణమవ్వడంతో, ఆండాళ్ తల్లి (గోదాదేవి) భక్తికి మెచ్చి రంగనాథ స్వామి ఆమెను పరిణయమాడే ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భోగి పండుగ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, విశేష అర్చనలు నిర్వహించారు. ధనుర్మాస వ్రత ముగింపు సందర్భంగా ‘తిరుప్పావై’ ముగింపు పాశురాల పఠనం (శాత్తుమురై) శాస్త్రోక్తంగా జరిగింది. సాయంత్రం 7.00 గంIIలకు నిర్ణయించిన శుభ ముహూర్తంలో శ్రీ గోదాదేవి, శ్రీ రంగనాథ స్వామి వార్ల ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలతో, విశేష ఆభరణాలతో అలంకరించి మండపానికి వేంచేపు చేశారు. అర్చకుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఎదుర్కోలు ఉత్సవం, పూలమాలల మార్పిడి, మాంగళ్యధారణ మరియు తలంబ్రాల ఘట్టం కన్నులపండువగా సాగింది. కళ్యాణానంతరం భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. లోక కల్యాణం కోసం, పాడిపంటలు వృద్ధి చెందాలని కోరుతూ నిర్వహించిన ఈ వేడుకలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు, అర్చక స్వాములు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమమునకు ఉభయకర్తలుగా ‘’శ్రీ కృష్ణ చరిత మానస ప్రచార మండలి తరపున శ్రీ కొండేటి పెంచలయ్య – శ్రీమతి లలితా కుమారి గార్లు’’. భోగి పండుగ వేళ శ్రీ గోదా రంగనాథుల కళ్యాణాన్ని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.
