భారత్ న్యూస్ డిజిటల్:భద్రాద్రి కొత్తగూడెం:
“ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి : ఎస్పీ రోహిత్ రాజు
సుజాతనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో Arrive-Alive కార్యక్రమం ప్రారంభోత్సవం
జిల్లా వ్యాప్తంగా పది రోజుల పాటు రోడ్డు భద్రతపై అవగాహనా కార్యక్రమాలు
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు,రవాణా,ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమమే Arrive-Alive-2026 అని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.
రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన Arrive-Alive కార్యక్రమాన్ని జిల్లాలో మంగళవారం నాడు సుజాతనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సుజాతనగర్ మండల పరిసర ప్రాంతాల ప్రజలు,ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత,డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు.రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు.రోడ్డుపై విధులలో పోలీసులు ఉన్నా,లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ,నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని కోరారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి తమ ప్రాణ భద్రతతో పాటు,ఇతరుల భద్రతకు కూడా సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్,సెల్ఫోన్ డ్రైవింగ్,రాంగ్ రూట్,సిగ్నల్ జంపింగ్,ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు.అనంతరం సుజాతనగర్ పరిధిలో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులు వారి ప్రస్తుత పరిస్థితిని అక్కడ పాల్గొన్న ప్రజలకు వివరించారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు,ప్రజలు,ప్రజా ప్రతినిధులు రోడ్డు భద్రతా నియమాల ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ట్రైనీ ఆర్డీఓ మురళి,జిల్లా రవాణాధికారి భూషితా రెడ్డి, ఆర్టీసి డిఎం రాజ్యలక్ష్మి,ఎంఆర్ఓ కృష్ణ,మోటారు వాహనాల అధికారులు వెంకట రమణ,వెంకట పుల్లయ్య,వైద్యారోగ్య శాఖ అధికారులు,సీఐలు ప్రతాప్,శ్రీలక్ష్మి,వెంకటేశ్వర్లు,సుజాతనగర్ ఎస్సై రమాదేవి,ఎస్సైలు రమణారెడ్డి,ప్రవీణ్,రవి తదితరులు పాల్గొన్నారు.