హైదరాబాద్:నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ చివరి వారంలో ఎక్సైజ్ శాఖ ముప్పేట దాడులు

భారత్ న్యూస్ డిజిటల్: హైదరాబాద్:నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ చివరి వారంలో ఎక్సైజ్ శాఖ ముప్పేట దాడులు

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లు, జిల్లా టాస్క్ ఫోర్స్ (DTF), ఎక్సైజ్‌ స్టేషన్ల బృందాలు అవసరమున్న చోట సంయుక్తంగా, లేదా విడివిడిగా ప్రత్యేక దాడులు నిర్వహించనున్నాయని తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ సి. హరికిరణ్‌ అన్నారు.

27-12-2025 నుండి 1-1-2026 వరకు (6) రోజుల పాటు నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ తో పాటు డ్రగ్స్‌ సరఫరా అమ్మకాలు, వినియోగాలపై తనిఖీలు, దాడులు నిర్వహించాలని ఆయన ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

తెలంగాణకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రైళ్లలోను, రోడ్డు మార్గాల ద్వారా బస్సుల్లో, పార్సిల్ వాహనాల్లో, కారులు ఇతర ప్రైవేట్ వాహనాల లోను, వాయు మార్గాల ద్వారానూ వచ్చె అవకాశం ఉన్న దరిమిలా, అలాంటి అన్ని వాహనా మార్గాలపై
ప్రత్యేక తనిఖీలు చేపట్టి ఎన్‌పీడీఎల్‌ మద్యాన్ని తెలంగాణలోనికి రాకుండా నిలువరించాలని కమీషనర్‌ అధికారులను అదేశించారు.

హర్యానా, ఢిల్లీ ల నుండి ఎన్ డి పి ఎల్ మద్యం అసిఫాబాద్‌, మంచిర్యాల్, రామగుండం, ఖాజీపేట, భువనగిరి స్టేషన్ల మీదుగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లలోనూ, అలాగే గోవా నుంచి గద్వాల్, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ ల మీదుగా వాస్కోడిగామా తదితర రైల్లల్లోను కోర్ అర్బన్ ప్రాంతానికి (TCUR) వస్తున్నట్లు ఎక్సైజ్‌ శాఖ గుర్తించిందని అన్నారు. విమానాల్లోను పై ప్రాంతాలనుండి NDPL వస్తున్నట్టు గుర్తించామన్నారు.

ఎక్సైజ్‌ శాఖలో పని చేస్తున్న నాలుగు ఎస్టీఎఫ్‌ టీమ్‌లు, జిల్లాలో ఉండే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లు, డీటీఎఫ్‌ టీమ్‌ల (34) తో పాటు ఆయా ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది (151) కలిసి ముప్పేట దాడులు నిర్వహించనున్నారని తెలిపారు.

ఇప్పటికే ప్రారంభమైన ఈ దాడుల్లో అధిక మోతాదులో నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ను, OG Kush, MDMA లాంటి డ్రగ్స్‌, గంజాయి, నల్ల బెల్లాన్ని, స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించుకునే పార్టీల్లో మద్యం వినియోగించుకునే చోట ఎక్సైజ్‌ అనుమతులు తప్పని సరిగా తీసుకొని మాత్రమే నిర్వహించుకోవాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామన్నారు.

నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌, డ్రగ్స్‌, గంజాయి వినియోగించడం నేరమనీ, వినియోగదారుల ఆరోగ్యాలకు, ప్రాణాలకు హానికరంగా పరిణమించ వచ్చనీ, కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండి, నూతన సంవత్సరానికి ఘనంగానూ, ఆహ్లాదకరంగాను సుస్వాగతం పలకాలని అన్నారు.