ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. గ్రామాల్లో కూడా అన్న క్యాంటీన్లు.. ప్రారంభానికి డేట్ ఫిక్స్

భారత్ న్యూస్ విజయవాడ…Anna Canteen: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. గ్రామాల్లో కూడా అన్న క్యాంటీన్లు.. ప్రారంభానికి డేట్ ఫిక్స్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. అలాగే ఇప్పటికే ప్రారంభించిన పథకాలను మరింతగా విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద పండుగ లాంటిది. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తమ సొంతూళ్లకు చేరుకుని కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు. దీంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమాల అమలుకు సంక్రాంతి పండుగను ఎంచుకుంటోంది. మరికొద్దిరోజుల్లో పండుగ వస్తున్న క్రమంలో మరో కీలక పథకాన్ని మరింత విస్తరించేందుకు సిద్దమంది. అదే అన్న క్యాంటీన్ల పథకం.

కొత్తగా 70 క్యాంటీన్లు
సంక్రాంతికి గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 70 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 13 నుంచి 15 మధ్య వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే నిర్మాణ పనులు జరుగుతోండగా.. ఆలోపు అన్నీ పూర్తి కానున్నాయి. సంక్రాంతికి ఈ కొత్త అన్న క్యాంటీన్లు అన్నీ అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు మండల, నియోజకవర్గ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లోనే అన్న క్యాంటీన్లు నడుస్తుండగా.. గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీటిని నెలకొల్పుతున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రామీణ ప్రజలకు కూడా రూ.5కే రుచికరమైన భోజనం అందుబాటులోకి రానుంది.

మూడు పూటలా రుచికరమైన భోజనం
అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే టిఫిన్, లంచ్, డిన్నర్ సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 205 అన్న క్యాంటీన్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటివరకు వీటి ద్వారా దాదాపు 7.20 కోట్ల మందికిపైగా భోజనం చేశారు. ఉదయం, రాత్రి కంటే మధ్యాహ్న భోజనం ఎక్కువమంది తింటున్నారు. ప్రధాన సిటీలైన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలోని క్యాంటీన్లలో ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పనుల కోసం సిటీలకు ఎక్కువమంది ప్రజలు వస్తుంటారు. రోజువారీ కూలీలు ఉపాధి కోసం సిటీలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. దీని వల్ల ఇక్కడి క్యాంటీన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.