బాపట్ల జిల్లా పంగులూరులో బెల్ట్‌షాపులపై భగ్గుమన్న మహిళలుఅక్రమంగా దాచిన మద్యం సీసాలను వీధిలోకి తీసుకొచ్చి దహనం

భారత్ న్యూస్ విజయవాడ…బాపట్ల జిల్లా పంగులూరులో బెల్ట్‌షాపులపై భగ్గుమన్న మహిళలు
అక్రమంగా దాచిన మద్యం సీసాలను వీధిలోకి తీసుకొచ్చి దహనం
ఇకపై మద్యం అమ్మితే ‘ఖబడ్దార్‌’ అంటూ హెచ్చరిక

బెల్ట్‌ షాపులకు వ్యతిరేకంగా మహిళలు సోమవారం రాత్రి ఉద్యమించారు. ర్యాలీగా వెళ్లి బాపట్ల జిల్లా పంగులూరు మండలం కోటపాడు గ్రామంలోని బెల్ట్‌ షాపులపై దాడి చేశారు. అక్రమంగా దాచిన మద్యం సీసాలను బయటకు తీసుకొచ్చి వీధిలో తగలబెట్టారు. ఇకనుంచి మద్యం అమ్మితే ఊరుకునేది లేదని నిర్వాహకులను హెచ్చరిక చేశారు. మద్యం వల్ల మా కుటుంబాలు నాశనమవుతున్నాయని, కుటుంబాల్లో కలహాలు చెలరేగి భార్యాభర్తలు విడిపోతున్నారని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే తమ తడాఖా చూపిస్తామని మహిళలు హెచ్చరించారు. వీరికి గ్రామస్తులంతా వీధిలోకి వచ్చి మద్దతు తెలిపారు. మద్యం షాపులను నిర్వాహకులను కట్టడి చేయండి అంటూ ప్రోత్సహించారు. ఐద్వా అఖిల భారత నాయకురాలు డి.రమాదేవి సోమవారం రాత్రి కోటపాడు గ్రామంలోని దళిత కాలనీలో మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మా గ్రామంలో ఏడు బెల్ట్‌ షాపులు నడుస్తున్నాయని, మద్యం వల్ల మా కుటుంబాలు సర్వనాశనమవుతున్నాయని తెలిపారు. మా గ్రామంలో మద్యం అమ్మడానికి వీల్లేదని, ఇందుకోసం ఏ పోరాటానికైనా సిద్ధమేనని చెప్పారు. అనంతరం మహిళలంతా బెల్ట్‌ షాపులపై దాడికి కదిలారు. తొలుత దళిత కాలనీ పక్కనే ఉన్న బత్తుల కొండలు బెల్ట్‌ షాపుపై దాడి చేశారు. మద్యం సీసాల కోసం వెతికారు. ముందుగానే సమాచారం అందుకున్న కొండలు వాటిని వేరేచోటకు పంపాడని తెలుసుకొని మహిళలు అక్కడి నుండి ఇరగని గోవిందమ్మ బెల్ట్‌ షాపు వద్దకు వెళ్లారు. ఆమెతో మాట్లాడారు. పంగులూరు, ముప్పవరం బ్రాందీ షాపుల నుండి మద్యం బాటిళ్లు తీసుకొస్తున్నానని, రోజుకు పది క్వార్టర్ల మద్యం అమ్ముతున్నానని, రూ.400 ఆదాయం వస్తోందని గోవిందరమ్మ చెప్పారు. ఇక నుండి మద్యం అమ్మితే ఊరుకోబోమని మహిళలు హెచ్చరించారు. ఆ తర్వాత గ్రంధి రామారావు, గ్రంధి మహాలక్ష్మి బెల్ట్‌ షాపులపై దాడి చేశారు. ఈ సందర్భంగా బెల్ట్‌ షాపు నిర్వాహకులకు, వారికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మహిళలు వారి ఇంట్లోకి వెళ్లి దాచిపెట్టిన మద్యం సీసాలను, గ్లాసులను, కాళీ మద్యం సీసాలను బయటకు తీసుకొచ్చి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ మద్యం వల్ల అనేక కుటుంబాలు సర్వనాశనమవుతున్నా ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోందని, మద్యం షాపుల్లో ఎమ్మెల్యేలకు కూడా వాటాలు ఉన్నాయని అన్నారు. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులను కొందరు మద్యానికి ఖర్చు పెడుతున్నారని, అటువంటి వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని తెలిపారు. గంజాయిని నిలువరించేందుకు నెల్లూరు జిల్లాలో పోరాడుతున్న పెంచలయ్యను గంజాయి ముఠా దారుణంగా హత్య చేసిందని, దానిపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని అన్నారు. మద్యానికి, బెల్ట్‌ షాపులకు వ్యతిరేకంగా మహిళలంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. సిపిఎం మండల కార్యదర్శి తలపనేని రామారావు, సభ్యుడు గుడిపాటి మల్లారెడ్డి మాట్లాడుతూ గతంలో ఇక్కడ బెల్ట్‌ షాపులకు వ్యతిరేకంగా మహిళలు పోరాడారని, మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళలు ‘బెల్ట్‌ షాపులను నివారించాలి, బెల్టు షాప్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి, మా ఊరికి మద్యం వద్దు, గంజాయి గుండాల దాడికి బలైన పెంచలయ్యకు జోహార్‌’ అంటూ నినాదాలు చేశారు.