.భారత్ న్యూస్ హైదరాబాద్….బాలికను దత్తత తీసుకున్న అమెరికన్ దంపతులు.
ధ్రువపత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
పల్నాడు జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో ఉన్న బాలికను అమెరికన్ దంపతులు దత్తత స్వీకరించారు. తల్లిదండ్రులు వదిలివేసిన అమర ప్రగతి(2) అను బాలికను అమెరికన్ దంపతులకు దత్తత ఇస్తూ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ధ్రువపత్రం అందజేశారు.
బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో అమెరికన్ దంపతులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. దత్తత తీసుకునేందుకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. దంపతుల ఆర్థిక పరిస్థితి, పిల్లల అవసరం తదితర అంశాలను పరిశీలించి దత్తత ధ్రువపత్రం జారీ చేశారు.
బాలికకు 21 ఏళ్ల వయసు వచ్చే వరకూ తన సంరక్షణను పర్యవేక్షిస్తామన్నారు. మొదటి సంవత్సరం ప్రతి వారం బాలిక పెంపకంపై సమీక్ష ఉంటుందన్నారు. అనంతరం మూడేళ్ల పాటూ నెలకోసారి, ఆ తర్వాత ఏడాదికోసారి సమీక్ష చేస్తామన్నారు.

సురక్షితమైన దత్తత కోసం ఐసీడీఎస్ ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారి ఎం. ఉమాదేవి, దత్తత మేనేజర్ ఎం కుమారి, డి.సి.పి.ఓ శౌరిరాజు, మిషన్ వాత్సల్య కోఆర్డినేటర్ సంతోష్ కుమారి,ఈవో ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.