భారత్ న్యూస్ గుంటూరు….అధికార యంత్రాంగం రైతులకు అనునిత్యం అందుబాటులో ఉంది
దిత్వా తుఫాన్ నేపథ్యంలో జీపీఎస్ నిబంధనకు ఉపశమనం ఇచ్చారు
ధాన్యం తరలింపులకు అదనంగా వాహనాలు అందుబాటులోకి వచ్చాయి
అవసరమైతే రైతులు సంత మార్కెట్లోని గోడౌన్ వాడుకోండి
తక్కువ ధరకు కొంటున్నారనే అపోహలు నమ్మకండి
-నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్
కోడూరు: దిత్వా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం రైతులకు అనునిత్యం అందుబాటులో ఉండి ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ తెలిపారు. ఆదివారం వెంకట్రామ్ కోడూరు, లింగారెడ్డిపాలెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, సంత మార్కెట్ ఆవరణలోని గోడౌన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, సొసైటీ చైర్మన్లు, నాయకులు, మిల్లరుతో మాట్లాడి క్షేత్ర స్థాయి పరిస్థితిని పరిశీలించారు. కోడూరులో ఒకే రైస్ మిల్లు ఉండటంతో అదనంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన మిల్లర్ ప్రతినిధి శాస్త్రితో మాట్లాడి వారి నుంచి రైతులకు అందించే సహకారంపై చర్చించారు. ప్రభుత్వం జీపీఎస్ నిబంధనకు ఉపశమనం ఇచ్చిన నేపథ్యంలో పెరిగిన వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని వెంకట్రామ్ మిల్లరును కోరారు. కోడూరు మండలంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసిన నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు, సహకార సంఘాల ప్రతినిధులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది నిరంతర పర్యవేక్షణతో సాధ్యమైనంత వేగంగా ధాన్యం మొత్తం మిల్లులకు తరలించే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. రైతులు అవసరమైతే, సంత మార్కెట్ వద్ద ఉన్న గోడౌన్ వాడుకోవాలని సూచించారు.
రైతు సేవా కేంద్రం ద్వారానే అమ్మండి
తుఫాన్ నేపథ్యంలో ధాన్యానికి ధర రావట్లేదనే అపోహలను రైతులు నమ్మవద్దని సూచించారు. రైతులు తొందరపడి వ్యాపారులు, దళారుల వద్దకు వెళ్లి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రతి రైతుకు ప్రభుత్వ మద్ధతు ధర దక్కేలా రెవిన్యూ అధికారులు, సొసైటీ ప్రతినిధులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి పని చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో పీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు,వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి శ్రీనివాసరావు, ఇంచార్జి తహసీల్దార్ సౌజన్య కిరణ్మయి, పీఏసీఎస్ చైర్మన్లు పూతబోయిన కరుణ కుమార్, కోట సుబ్బారావు, జనసేన టౌన్ అధ్యక్షులు కోట రాంబాబు, జనసేన పార్టీ నాయకులు కొల్లి వెంకటేశ్వరరావు (చినబాబు), కాగిత రామారావు, జరుగు ఆదినారాయణ, జరుగు పోతురాజు, కోట ప్రసాద్, జరుగు లక్ష్మణ, అప్పికట్ల అంకబాబు, సొసైటీ సీఈఓలు అర్జా వెంకట నగరాయలు, చిట్టిప్రోలు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
