జూబ్లిహిల్స్: పరువు పోగొట్టుకున్న బీజేపీ

.భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లిహిల్స్: పరువు పోగొట్టుకున్న బీజేపీ

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ పరువు పోగొట్టుకుంది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ అన్నీ బీఆర్ఎస్ కోసం అన్నట్లుగా చేయడంతో మొదటికే మోసం వచ్చింది. చివరికి డిపాజిట్ తెచ్చుకోవాలని కాంగ్రెస్ నేతలు చేసిన సవాళ్లను స్వీకరించలేకపోయారు. ఎందుకంటే డిపాజిట్ వస్తుందన్న నమ్మకం వారికి లేకపోయింది. ఇప్పుడు అదే నిజం అయింది.

జూబ్లిహిల్స్ లో బీజేపీకి నికరంగా పాతిక వేల ఓటు బ్యాంక్ ఉంటుంది. గత ఎన్నికల్లో అన్ని ఓట్లు వచ్చాయి. కానీ ఈ సారి కనా కష్టంగా పది వేలు ఓట్లు సాధించడం గగనంగా మారింది. దీనికి కారణం మొదటి నుంచి ఆ పార్టీ రేసులో ఉన్నట్లుగా రాజకీయాలు చేయలేదు. ఆరు నెలలు సాధన చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్లుగా పాత అభ్యర్థినే .. నామినేషన్లు ప్రారంభమయ్యాక ప్రకటించారు. ప్రచారంలో బండి సంజయ్ దూకుడు చూపిస్తున్నారన్నప్పుడు ఆయనను పక్కన పెట్టి కిషన్ రెడ్డిని రంగంలోకి దింపారు. మొత్తం హైప్ పోయింది. ద్విముఖ పోటీగా మారింది.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందని.. బీజేపీ కోసం బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుందని రేవంత్ రెడ్డి విమర్శించేవారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ కోసం బీజేపీ ఆత్మహత్య చేసుకుందని విమర్శిస్తారు. మొత్తంగా బీజేపీ వ్యూహాలు ఎందుకింత గందరగోళంగా ఉన్నాయో కానీ.. బీఆర్ఎస్ కు మాత్రం బీజేపీనే ఆప్షన్ గా మారుతోంది.