దేశంలో అత్యున్నత పదవి.. జీతం మాత్రం సున్నా!

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశంలో అత్యున్నత పదవి.. జీతం మాత్రం సున్నా!

ఉప రాష్ట్రపతి పదవికి జీతమంటూ ఏమీ ఉండదు

రాజ్యసభ చైర్మన్‌ హోదాలో ఏటా రూ.48 లక్షలు

రెండేళ్లకు పైగా పదవిలో కొనసాగితేనే పెన్షన్

భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో రెండో అత్యున్నత పదవి ఉప రాష్ట్రపతి.. పేరుకు దేశంలో రెండో అత్యున్నత పదవే అయినా ప్రత్యక్షంగా జీతమంటూ లేని హోదా ఉప రాష్ట్రపతిది. దేశ ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గానూ వ్యవహరిస్తారు. ఆ హోదాలో ఉప రాష్ట్రపతి జీతం అందుకుంటారు. శాలరీస్‌ అండ్‌ అలవెన్సెస్‌ ఆఫ్‌ ఆఫీసర్స్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ యాక్ట్‌ -1953 ప్రకారం..‘‘ఉప రాష్ట్రపతి జీతానికి సంబంధించి ఎలాంటి నిబంధన లేదు. రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరించినందుకు మాత్రమే ఆయనకు వేతనం, ఇతర భత్యాలు అందుతాయి’’ అని అధికారులు స్పష్టం చేశారు.

ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌ గా నెలకు రూ.4 లక్షల చొప్పున ఏడాదికి రూ.48 లక్షలు వేతనంగా పొందుతారు. ఉచిత నివాస సదుపాయం, వైద్య సేవలు, ప్రయాణ ఖర్చులు, ల్యాండ్‌లైన్‌ కనెక్షన్, మొబైల్‌ ఫోను, వ్యక్తిగత భద్రత, సిబ్బంది వంటి సదుపాయాలు అదనంగా ఉంటాయి. పదవీ విరమణ చేసిన ఉప రాష్ట్రపతికి నెలకు సుమారు రూ.2 లక్షల పింఛనుతో పాటు ఉచితంగా టైప్‌-8 బంగ్లా సౌకర్యం లభిస్తుంది.

అయితే, ఉప రాష్ట్రపతిగా కనీసం రెండేళ్లకు పైగా సేవలందించిన వారికే పింఛను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, మాజీ ఉప రాష్ట్రపతికి ఒక సెక్రెటరీ, అడిషనల్ సెక్రెటరీ, వ్యక్తిగత సహాయకుడు, వైద్యుడు, నర్సింగ్‌ అధికారి, నలుగురు వ్యక్తిగత సిబ్బందిని కూడా కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.